Monday, December 23, 2024
[t4b-ticker]

అతని అక్షరం మండుతున్న అగ్నికణం..ఆయన కవిత్వం ఓ పాశుపతాస్త్రం..సామాన్యుని కష్టాలే ఆ కలం కవితా వస్తువులు.. కష్టజీవి కన్నీళ్లే ఆ పెన్నుకు ఇంకు చుక్కలు.. తెలంగాణ సాహితీ వనంలో పూసిన ఆ ఎర్రమందారమే అలిశెట్టి ప్రభాకర్.. సరళమైన పదాలు.. రక్తం ఉడికించే మాటలతో మర ఫిరంగుల్లాంటి కవితలు రాసిన అలిశెట్టి ప్రభాకర్ జన్మదిన మహా జ్ఞాపకం !

- Advertisment -spot_img

తెలంగాణ రాష్ట్రం (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1956 జనవరి 12 న పుట్టారు. అలిశెట్టికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. తండ్రి పరిశ్రమల శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. కరీంనగర్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసిన ప్రభాకర్.. ఇంటర్ కోసం సిద్దిపేటలో ఉన్న అక్కా, బావ ఇంటికెళ్లారు.. అక్కడ మాట పట్టింపులు రావడంతో తిరిగి జగిత్యాలకు వచ్చారు. తండ్ర మరణంతో 11 ఏళ్ల వయసులో ప్రభాకర్ కుటుంబ పోషణ బాధ్యతలు స్వీకరించాడు.
…..
ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలయిన ‘భాగ్యం’ ను పెళ్ళి చేసుకొన్నారు. జీవిక కోసమే తప్పా, ఏనాడు సంపాదన కొరకు ఆరాటపడని మనిషి. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే, కవిగా ఎదిగాడు. 1982 లో హైదరాబాదులో స్థిరపడ్డారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు.

చిత్రకారుడిగా….ఫోటో గ్రాఫర్‌గా – అలిశెట్టి

ఫొటోగ్రఫీపై ఉన్న ఇష్టంతో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు ప్రభాకర్..పెన్సిల్ తో బొమ్మలు గీసే హాబీ, ప్రభాకర్ జీవితానికి సాహిత్యాన్ని పరిచయం చేసింది.. కొంతమంది మిత్రుల సూచనలతో కవితలకు సరిపోయే బొమ్మలు గీసి ఇచ్చిన ప్రభాకర్.. వాటి స్ఫూర్తితో కవిత్వం రాశాడు.. అలా 18 ఏళ్ల వయసులోనే బూర్జువా దోపిడీదారులపై కలాన్ని ఎక్కుపెట్టాడు.1975లో పరిష్కారం పేరుతో అలిశెట్టి రాసిన కవిత తొలిసారి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది.
……
ఓ వైపు ఫొటోలు తీస్తూనే.. ఇంకోవైపు కవితలు రాశాడు. మరోవైపు బొమ్మలు కూడా గీశాడు. తనలోని భావాలకు చిత్రరూపమిచ్చి వాటితోనే చిత్రకవితలు రాశాడు. ఆ ప్రక్రియ అప్పట్లో పెద్ద సంచలనం. 1981లో ‘చురకలు’ కవితా సంకలనాలను పీడితుల పక్షాన సంధించాడు. వ్యంగ్యం, పదును, విమర్శ, సామాజిక స్పృహ లాంటివన్నీ ఒకేసారి చురకల్లో కనిపిస్తాయి. ప్రజల కోసం, వారి బతుకులు బాగు చేయడానికి వారి బాధలు ప్రపంచానికి తెలియచేయడానికే కవిత్వమని నమ్మిన ప్రభాకర్ అందుకోసం అహర్నిశలు శ్రమించాడు..
…..
ఆయన మొదట జీవితాన్ని ఫోటో గ్రాఫర్‌గా ఉంటూనే ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేసేవాడు. సిరిసిల్లలో రాం ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ నేర్చుకొని, 1975 లో జగిత్యాలలోని సొంత ఇంట్లో పూర్ణిమ స్టూడియో ప్రారంభించాడు. కరీంనగర్‌లో స్టూడియో శిల్పి (1979), హైదరాబాద్లో చిక్కడ్పల్లి లో స్టూడియో చిత్రలేఖ (1983) పేర్లతోనూ స్టూడియోలు నడిపి ఫోటో గ్రాఫర్‌గా జీవితాన్ని గడిపాడు.

  • కవిగా – అలిశెట్టి….

జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలో ప్రవేశించినప్పటికి ప్రభాకర్ గుండె
లోతుల్లో అణిచివేయబడ్డ బడబాగ్ని 1978లో జగిత్యాల జైత్రయాత్రతో ఉప్పెనలా బయటకొచ్చింది. పెత్తందారి వ్యవస్థ మీద పేదోళ్లు జరుపుతున్న పోరుతో ప్రభాకర్ లోని అక్షర సూరీడు కొత్త దిక్కున ఉదయించాడు. అందుకే జైత్రయాత్రలో ప్రజల ఉరకలెత్తే ఉత్సాహాన్ని చూసి తనలోని ఆవేశాన్ని ఎర్రపావురాలుగా ఎగరేశాడు. ఆనాటి నుంచి ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. అల్పాక్షరాలతోనే అనల్పార్థాన్ని ఇచ్చే నానీలనే మినీ కవిత్వంతో తెలుగు సాహితీలోకంలో అలజడి సృష్టించాడు. అక్షరాలతోనే సమర శంఖం పూరిస్తున్న ప్రభాకర్ పై ప్రభుత్వాలు, పోలీసులు, భూస్వాములు కక్షకట్టారు. ఫలితంగా నిర్బంధం నీడలా వెంటాడింది.. అందుకే జగిత్యాల నుంచి కరీంనగర్ కు షిఫ్ట్ అయ్యాడు. బతకడం కోసం శిల్పి స్టూడియో ప్రారంభించాడు.1979లో ‘‘మంటల జెండాలు’’ సంకలనాన్ని వెలువరించాడు. అందులో వచ్చిన దోపిడీ చిహ్నం, దశ, పింజర లాంటి ఎన్నో కవితలకు ఇండియన్ ఇంక్‌తో అద్భుతమైన చిత్రాలు గీశాడు.
…..
‘‘తను శవమై.. ఒకరికి వశమై.. తనువు పుండై.. ఒకడికి పండై.. ఎప్పుడూ ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై’’ అంటూ సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాన్ని ప్రపంచానికి చాటాడు ప్రభాకర్. నాలుగు వాక్యాల్లోనే ఆ అభాగ్యుల జీవన వేదనను కళ్లకు కట్టినట్టు ఒక్క అలిశెట్టి తప్ప ఇంకెవరు ఇప్పటికీ చెప్పలేకపోయారు.
…….
అలిశెట్టికి రాజకీయాలన్నా. నాయకులన్నా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత. అందుకే
‘‘ఓ నక్క ప్రమాణం స్వీకారం చేసిందట. ఇంకెవర్నీ మోసగించనని.. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందంట.. తోటి జంతువుల్ని సంహరించనని.. ఈ కట్టుకథ విని.. గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయ్’’ అంటూ రాజకీయ నాయకుల తీరును కవితలతో ఏకిపారేశాడు.
……
వకీలు అనేవాడు” ఎకీలు ను ఆ కీలు గా విడగొట్టే ” వానిగా మనకు చూపింది ప్రభాకరే కదా.!నగరం లోని వాడిపోయిన బతుకుల సగటు జీవి పెదవులపై విరబూసిన చిరునవ్వును
“ప్లాస్టిక్ పువ్వులతో ” పోల్చి మన నాగరికత లోగుట్టును బయటపెట్టిన ధీరుడు ప్రభాకర్

  • హైదరాబాద్ కు మకాం మార్పు….

జగిత్యాల-సిరిసిల్ల ప్రాంతాలలోని 1980 -1984 సంవత్సరాలలోని రాజకీయ సామజిక పరిస్థితులు ప్రభాకర్ జేవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపడం వల్లే ప్రభాకర్ జగిత్యాల నుండి కరీంనగర్ కు , అక్కడినుండి హైదరాబాద్ కు మకాం మార్చాల్సిన దుర్గతి వచ్చింది. అయన రాసిన కవిత్వంలోని జీవితాన్ని కాకుండా అందులో ఉన్న అక్షరాల భహిరంగ అర్థాన్నే చూసిన ఈ ప్రభుత్వ ప్రతినిధులు పరోక్షంగా ఆయన ను అనేకరకాలుగా వేధించారు. కవిత్వం అంటే ప్రజల కొరకు, వారి బతుకులు బాగు చేయడానికి, వారి బాధలు ప్రపంచానికి తెలియ జేయడానికే అంటూ ప్రభాకర్ అహర్నిశలు శ్రమించాడు.అతని కవిత్వంలో ఆనాడే పురుడుపోసుకొంటున్న స్త్రీ వాదం, దళిత వాదం కూడా స్తానం కల్పించుకోన్నాయి.
……
1982లో భార్య, ఇద్దరు పిల్లలతో కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చాడు. ఆయన రాసిన రక్తరేఖ, సంక్షోభ గీతాలు కవితలు సామాన్యులనూ ఆకట్టుకున్నాయి. ప్రభాకర్ దృష్టిలో జీవితం, జీవించడం రెండూ వేర్వేరు. అలా సమాధిలా.. అంగుళం మేరకన్నా కదకుండా పడుకుంటే ఎలా? కొన్నాళ్లు పోతే.. నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకే తెలిసి చావదు అంటూ జీవితానికి, జీవించడానికి తేడా చెప్పాడు.
…….
1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత. ఎర్ర పావురాలు (1978) అచ్చైన ఆయన మొదటి కవితా సంకలనం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు సీరియల్‌గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతిపొందాడు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వం రాశాడు.

  • అతని ప్రసిద్ధ కవితలు…

తనువు పుండై… తాను పండై…తాను శవమై…వేరొకరి వశమై…తను ఎడారై … ఎందరికో.. ఒయాసిస్సై…. అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ స్థితి గురించి ఆయన రాసిన కవిత సుప్రసిద్దమైనది. వేశ్యల గురించి ప్రస్తావన వచ్చిన అనేక సందర్భాలలో అనేక మందిచే ఉదహరింపబడిన కవిత.
…..
హృదయ త్రాసు కవిత ఆయనకు కవిగా మంచి పేరు తెచ్చినదే.
ఉదహరింపు కవితలో ఇలా అంటారు

శిల్పం
చెక్కకముందు బండ
శిక్షణ
పొందకముందు మొండి
ప్రతిభ
వెనకాల ఎంతో ప్రయాస
సో…….
కాలానికి
వదలకు భరోసా
ప్రతిభలేకపోతే జీవితం వ్యర్థం అని, సాధన చేస్తేనే బండ శిల్పంగా మారుతుందని, కాలానికి వదిలేయకుండా ప్రయత్నం చేయాలని ఈ చిన్న కవితలో ఎంతో అందంగా చెప్పారు ప్రభాకర్.

జీవితం అనే మినీ కవితలో మనిషి ప్రకృతిని చూసి ఎంతో నేర్చుకోవలసినది ఉందంటారు. చిన్న విత్తనం నుంచి బయటకు వచ్చిన మొక్క, మానుగా మారి కొమ్మలు, రెమ్మలతో శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఆకాశం అంత ఎత్తును చూస్తుంది. అంతేకాదు, తాను సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆశ్రయించినవారికి నీడ ఇస్తుంది. సమాజంలో పుట్టిన వ్యక్తి కూడా స్వార్థ చింతన మానుకుని వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకుని తనకు, తన కుటుంబానికే కాక సమాజానికి ఉపయోగపడాలి అనే సందేశాన్ని ఎంతో తేలికైన మాటలతో చక్కగా వివరించారు. జీవితంలో నిరాశావాదానికి చోటులేదంటారు. వృక్షం స్వయంకృషికి ప్రతీక అంటారు -జీవితం అనే ఈ మినీకవితలో.

ఈ వృక్షం
నువ్వు ఉపిపోసుకోడానికి
వినియోగింపబడ్డది కాదు
స్వయం కృషిని
శాఖోపశాఖలుగా
విస్తరింపజేసుకొమ్మని.

  • అచ్చైన కవితా సంకలనాలు…

1) ఎర్ర పావురాలు (1978)
2) మంటల జెండాలు (1979)
3) చురకలు (1981)
4) రక్త రేఖ (1985)
5) ఎన్నికల ఎండమావి (1989)
6) సంక్షోభ గీతం (1990)
7) సిటీ లైఫ్ (1992)
8) మరణం నా చివరి చరణం కాదు

  • “ఆంధ్రజ్యోతి” సిటి లైఫ్ శీర్షిక …..

ప్రభాకర్ జీవన భ్రుతికి తోడ్పడిన “ఆంధ్రజ్యోతి” సిటి లైఫ్ శీర్షికన కార్టూనిస్ట్ నర్సింగ్ తో కల్సి రాసిన సెటైర్ కవితలు ఒక కొత్త ఒరవడికి నాంది పలికాయి. నగర జీవితాలపై రాజకీయాలపై అక్కడి సామాన్య బడుగు జీవులపై అయన రాడిన అనేక పొట్టి కవితలు నేడు ఎంతోమంది రచనలలో ఉపమా అలంకారాలుగా,సెటైర్ లు గా ఉపమానాలుగా వాడుకోబడుతున్నాయి

  • ఆదర్శవంతమైన జీవితం గడిపిన ప్రభాకర్….

దేశంలో ఎంతోమంది ప్రజలకోరకని తమ
వ్యక్తిగత జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన ఎంతోమంది సాహిత్య ఉద్యమకారుల్లో జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ ఒకరు.ఈ వ్యవస్తను మార్చడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేసికొని కవిత్వం రాసిన ప్రభాకర్ తన కవితల్లో సమాజంలోని రుగ్మతలను ఎండకట్టి, సామాన్య పాటకుల మన్నలనే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు అయితే ఆయన దాని ప్రతిగా తన వ్యక్తిగత జీవితాన్నే కాకుండా తన కుటుంబ జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది 1980 వరకే సాహిత్య ప్రపంచంలో తనకంటూ,ముఖ్యంగా మినీ- కవితలలో రచనలో ప్రభాకర్ తన ప్రత్యేక ముద్రతో ప్రజల హుద్రయాల్లో స్తిర స్తానం కల్పించుకున్నారు. తన కుటుంబానికి మూడు పూటల భోజనం పెట్టలేని స్తితిలో ఉన్నా తన ” చురకులు” కవితల సంపుటిని ప్రచురించి దాని అమ్మకం ద్వారా వచ్చిన కొద్ది డబ్బును ఆస్పత్రిలో ఉన్న చెరబండ రాజు కు ఆర్తిక సహాయంగా అందజేసిన సహృదయుడు ప్రభాకర్.

  • మరణం నా చివరి చరణం కాదని ప్రకటించిన ప్రభాకర్…..

కబళించే మృత్యువును ముందే గుర్తించాడు. తెర వెనక లీలగా మృత్యువు కదలాడినట్టు
తెరలు తెరలుగా దగ్గొస్తుంది. తెగిన తీగెలు సవరించడానికన్నట్టు గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం గ్లాసెడు నీళ్లందిస్తుందని పర్సనల్ పోయెం అనే కవితలో రాసుకున్నాడు. చివరి రోజుల్లో పేదరికంతో పోరాటం చేసిన ప్రభాకర్.. పైసల కోసం దారి తప్పలేదు. ఆయన రాసిన కవితల్ని సినిమాలకు అమ్ముకునే అవకాశమచ్చి నా ఒప్పుకోలేదు.. సినిమాకవిగా మారి ఉంటే ఎంతో డబ్బు, పేరు సంపాదించేవాడు. కాని, సమాజంకోసమే రాస్తానన్న మాటలకు చివరి శ్వాసవరకుకట్టుబడి ఉన్నాడు. ఫలితంగా అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక 1993 జనవరి 12న హైదరాబాద్ లో చనిపోయాడు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular