Thursday, March 26, 2026
[t4b-ticker]

అధికారులు ఎక్కడ.. అటెండర్లే దిక్కా..?

ఖాళీ కుర్చీల దర్శనం. హుజూర్ నగర్ ఎం.ఈ.ఓ కార్యాలయం..?

అధికారులు ఎక్కడ.. అటెండర్లే దిక్కా..?

ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు.. పర్యవేక్షణ శూన్యం..!

హుజూర్నగర్,మార్చి 25,mbmtelugunews.com// ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల సమస్యలు తీర్చడానికి ఉండాలి, కానీ హుజూర్ నగర్‌లోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం మాత్రం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఎన్ఎస్పీ క్యాంప్ పరిధిలో ఉన్న ఈ ఆఫీసులో అధికారుల జాడ లేక, కేవలం ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిస్తుండటంతో స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి ఏ పని మీద వెళ్లినా అధికారులు సీట్లలో ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. ఆఫీసు మొత్తం మీద కేవలం ఒక అటెండర్, డెప్యుటేషన్ మీద ఉన్న మరో సిబ్బంది తప్ప మరెవరూ కనిపించని పరిస్థితి. అసలు ఈ కార్యాలయంలో ఎంతమంది సిబ్బంది పని చేస్తున్నారు? ప్రభుత్వం జీతాలు ఇస్తుంది కుర్చీలకు, బల్లలకా లేక విధి నిర్వహణలో లేని ఉద్యోగులకా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విమర్శలు వస్తున్నాయి.ఒకవైపు కార్యాలయం ఇలా ఉంటే, మరోవైపు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకముందే, జూన్‌లో ప్రారంభం కావాల్సిన వచ్చే ఏడాది పాఠ్యపుస్తకాల అమ్మకాలను ఇప్పుడే మొదలుపెట్టాయి. ఈ దోపిడీని అరికట్టాల్సిన ఎంఈఓ కార్యాలయం మౌనం వహించడం వెనుక ఉన్న మర్మమేంటని పేరెంట్స్ కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
మేము మా సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఆఫీసులో ఒక్క అధికారి కూడా ఉండరు. అసలు అధికారులు ఏ సమయంలో అందుబాటులో ఉంటారో చెబితే ఆ టైమ్‌కే వస్తాం,” అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పుస్తకాల అమ్మకాల వెనుక, కార్యాలయ గైర్హాజరీ వెనుక అధికారుల వాటాల హస్తం ఉందా అనే అనుమానాలను ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి, హుజూర్ నగర్ ఎంఈఓ కార్యాలయం తీరును మార్చాలని, విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular