ఒలింపిక్ పతకంతో ప్రమోషన్..
Mbmtelugunews//స్పోర్ట్స్,ఆగష్టు 16 ప్రతినిధి మాతంగి సురేష్:పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యంతో మెరిసిన భారత రెజ్లర్ అమన్ షెహ్రావత్ పై అభినందనల వర్షం కురుస్తోంది.21 ఏండ్లకే ఒలింపిక్ పతకం కలను నిజం చేసుకున్న అమన్ భావి రెజ్లర్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.అరంగేట్ర విశ్వ క్రీడల్లోనే మెడల్ కొల్లగొట్టిన ఈ యువ రెజ్లర్ ప్రమోషన్ సాధించాడు.ఉత్తర భారత రైల్వేస్ అతడిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్టీ) ప్రమోట్ చేసింది.ఈ మేరకు గురువారం అధికారిక ప్రకటన వెలు వరించింది.’ఉత్తర భారత రైల్వే ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జనరల్ మేనేజర్ శోభన్ చౌదరి ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన అమన్ షెహ్రావత్ ని అభినందించారు.అనంతరం ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అమన్ ను ఓఎస్టీగా ప్రమోట్ చేశారు.ఫ్రీస్టయిల్ రెజ్లర్ అయిన అమన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో దేశ గౌరవాన్ని,కీర్తిని పెంచాడు.అతడి అంకితభావం,కష్టపడే గుణం లక్షలాదిమందికి స్ఫూర్తిదాయకం’ అని ఉత్తర రైల్వే పీఆర్వో వెల్లడించారు.
సీనియర్లను ఓడించి..
చిన్నతనం నుంచి రెజ్లింగ్ ను ఇష్టపడిన అమన్ అదే క్రీడలో ఆరితేరాడు.అయితే.. అతడి విజయాన్ని కళ్ళారా చూడకుండానే తల్లిదండ్రులు కాలం చేశారు.ఒకదశలో రెజ్లింగ్ ను వదిలేద్దామనుకున్న అమన్.. మేనమామ చొరవతో మళ్లీ మట్టిలోకి దిగాడు.కుస్తీలో మెలకువలు నేర్చుకొని సీనియర్లను ఓడించి సత్తా చాటాడు.ఒలింపిక్ ట్రయల్స్ లో టోక్యోలో రజతం గెలిచిన రవి దహియాను మట్టికరిపించిన అమన్..పారిస్ లో పతకంతో మెరిశాడు.57 కిలోల విభాగంలో తన ఉడుంపట్టుతో దేశానికి ఐదో కాంస్యం అందించాడు.దాంతో,2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ప్రతిసారి విశ్వ క్రీడల్లో రెజ్లర్లు పతకాలు సాధిస్తున్న ఆనవాయితీని అమన్ కొనసాగించాడు.