కార్మిక సమస్యల పరిష్కారం కై కలిసి పోరాడుదాం !
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 19(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక లాల్ బంగ్లాలో భారత కార్మిక సంఘాల సమైక్య(ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో ఈనెల 30వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కార్మికుల సమస్యలపై జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఐఎఫ్ టియు జిల్లా సహాయ కార్యదర్శి వి. నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక,ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సమస్యల పరిష్కారం కోసం దేశంలో, రాష్ట్రంలో అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని,ఐఎఫ్ టి యు ఆధ్వర్యంలో ధర్నాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
కార్మికులకు నష్టదాయకమైనటువంటి నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, తెలంగాణలో ఈ కోడ్ అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్,స్కీం వర్కర్ల కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, వారిని పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని,కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన జీవోను విడుదల చేయాలని,ఇంకా అనేక అంశాలపై వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలన్నింటి పరిష్కారం కోరుతూ చేపట్టబోయే ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టియు జిల్లా నాయకులు కామల్ల శ్రీను, ఉదయగిరి,దాసరి వెంకటేశ్వర్లు, కామల్లరవి,మైసయ్య,వీరబాబు,నరసింహారావు,రామారావు తదితరులు పాల్గొన్నారు.