హైదరాబాద్,అక్టోబర్ 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:హమాస్, ఇజ్రాయిలీ బలగాల మధ్య పాలస్తీనాలోని గాజాలో జరుగుతున్న దాడులు, ప్రతిదాడులను ఆపాలని,ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని,పరిస్థితి తీవ్రత చూస్తుంటే మరింత మంది ప్రాణాలు బలిగొనేలా, కష్టాలు కడగండ్లకు గురిచేసేలా ఉంది కాబట్టి ఈ ఘర్షణలకు వెంటనే స్వస్తి పలకాలని ప్రపంచ శాంతి ఉద్యమ కార్యకర్త వి.కృష్ణ మోహన్ కోరారు.
ఒక ప్రక్క పాలస్తీనీయుల సామూహిక హననానికి నెతాన్యాహు పిలుపునిచ్చారని, హమాస్‌పై ఇజ్రాయిల్ అధికారికంగా యుద్ధం ప్రకటించిందని, గాజా ప్రాంతాన్ని శిథిలంగా మారుస్తానని బెంజిమిన్ ప్రకటించారని, మరోప్రక్క గాజా భూభాగాన్ని ఇజ్రాయిల్ దిగ్బంధించటం, తమ పార్టీ కార్యకర్తలను హత్యలు చేయటం, అల్ అక్సా మసీదు ప్రాంతంలో నిత్యం రెచ్చగొట్టటం, భరించలేనంత అణచివేతకు ఇజ్రాయిల్ పాల్పడటంవల్లనే ప్రతిఘటన అనివార్యం అయిందని హమస్ పేర్కొనడంతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని వాపోయారు.
ఇజ్రాయిల్‌లోని పచ్చి మితవాద నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనాలోని భూములను విచక్షణారహితంగా ఆక్రమించి, అక్రమంగా యూదుల నివాసాలను ఏర్పాటు చేసిందని, ఈ ఘర్షణలకు ముందు రోజు వరకు 40 మంది పిల్లలతో సహా 248 మంది పాలస్తీనా వాసులు 2023లో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాతృభూమికి సంబంధించి పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించేలా ఐక్యరాజ్య సమితి చొరవ చూపాలని, పాలస్తీనా భూ భాగంలో ఇజ్రాయిల్ అక్రమంగా ఏర్పాటు చేసిన నివాసాలు, ఆక్రమణలను ఉపసంహరించుకోవాలని కోరారు. రెండు దేశాల ఏర్పాటుకు సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) తీర్మానాన్ని అమలు చేయాలని, ఐరాస చేసిన తీర్మానానికి అనుగుణంగా తూర్పు జెరూసలెం రాజధానిగా పాలస్తీనా ఏర్పడాలని,ఈ సంఘర్షణను తక్షణమే నిలిపి వేసేలా చూసేందుకు ఐరాస, భారత ప్రభుత్వంతో సహా అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని,ఐక్యరాజ్య సమితి తీర్మానం అమలుకు అవి తగు చొరవ చూపాలని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని వి. కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.
వి. కృష్ణ మోహన్
నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)
కార్యదర్శి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసీయేషన్ (టాప్రా) నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సి.సి.పి.ఏ) అనుబంధం 9182189533, 9440668281
kmdrdo@gmail.com



