దేవుడికి మానవులకు మధ్యలో ఎవరూ మధ్యవర్తులు లేరు
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్)దేవుడికి మానవులకు మధ్యలో ఎవరూ మధ్యవర్తులు లేరని ప్రబోధ సేవా సమితి కోదాడ శాఖ అధ్యక్షుడు పోటు వెంకటేశ్వర్లు అన్నారు.ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో ఇంటింటికి తిరిగి త్రైత సిద్ధాంత గ్రంథాలను ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల్లో చాలామంది దేవుడికి మానవులకు మధ్యలో మధ్యవర్తులు ఉన్నారని నమ్ముతున్నారన్నారు.హిందువులైతే దేవుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని వేదపండితులు చెప్పినట్లు ఆచరిస్తారని,చాలా మంది హిందువులు వేదపండితులకు పాదనమస్కారాలు చేస్తారన్నారు.చాలామంది వేదపండితులు తామే దేవుడికి మానవులకు మధ్యలో ఉన్న మధ్యవర్తులమని,దేవుడికి సంబంధించిన ఏ పూజ అయినా తాము మాత్రమే చేయాలని చెబుతారని,తమను గౌరవించి,భక్తితో పాదనమస్కారాలు చేస్తే ఆ దేవుడికి చేసుకున్నట్లుగానే చెబుతారన్నారు.అదే విధంగా చాలామంది క్రైస్తవులు తమ చర్చ్ ఫాస్టర్ ను అయ్య అని పిలుస్తూ ఆ ఫాస్టర్ ఎలా చెబితే అలా నడుచుకుంటారన్నారు.ఇక ఇస్లాం మతస్తులైతే తమ మస్జిద్ మతబోధకుడు (మౌలా,ఇమామ్) చెప్పినది తూచా తప్పకుండా ఆచరిస్తారని,ఇక వేరే ఎవరు చెప్పినా పొరపాటున కూడా వినరన్నారు.ఇక్కడే మాయ (సైతాన్)కు మంచి అవకాశం దొరికిందన్నారు.అందరిని భక్తిమార్గంలో ఉన్నట్లు నమ్మించి దేవుడి వైపు మనిషిని తీసుకెళ్లకుండా చేసిందన్నారు.ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు ద్వారా బహిర్గతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం దేవుడికి మానవులకు మధ్య ఎవరూ మధ్యవర్తులు లేరని స్పష్టం చేశారు.వాస్తవంగా ఉన్న మధ్యవర్తి ఎవరైనా ఉంటే దేవుడి ద్వారా బహిర్గతమైన భగవద్గీత, బైబిల్,ఖుర్ ఆన్ గ్రంథాల జ్ఞానమే అసలైన మధ్యవర్తి అన్నారు.ఏ మనిషి అయినా దేవుడి గురించి తెలుసుకోవాలని అనుకుంటే భగవద్గీత,బైబిల్,ఖుర్ ఆన్ గ్రంథాలను మత గ్రంథాలు అని భావించకుండా,దైవగ్రంధాలు అని భావించి శ్రద్ధతో చదివితే దేవుడి జ్ఞానం అర్ధమవుతుందన్నారు. మాయ (సైతాన్) ఇక్కడ కూడా పనిచేసి దైవగ్రంథాలను సైతం కలుషితం చేసి మాయ (సైతాన్) జ్ఞానాన్ని చేర్చి,అసలైన దేవుడి జ్ఞానం ఇదేనంటూ మభ్యపెడుతుందన్నారు.అధర్మాలు చెలరేగినప్పుడు దేవుడే రంగంలోకి దిగినట్లుగా ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు ద్వారా త్రైత సిద్ధాంత భగవద్గీత, బైబిల్, ఖుర్ ఆన్ లతో పాటు 100కి పైగా గ్రంథాల ద్వారా దేవుడి గురించి స్వచ్ఛమైన జ్ఞానం బయటకు రావడం మన అదృష్టం అన్నారు.త్రైత సిద్ధాంత గ్రంథాల్లో ఒక మతాన్ని గాని,కులాన్ని గాని కించపరచడం లేదన్నారు. త్రైత సిద్ధాంత గ్రంథాలు మతం గురించి బోధించకుండా దేవుడిని చేరుకునే విధానాన్ని బోధిస్తున్నాయన్నారు.దేవుడికి మానవుడికి మధ్యలో అసలైన మధ్యవర్తిగా త్రైత సిద్ధాంత గ్రంథాలు నిలుస్తాయన్నారు.ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కుల,మతాలకు అతీతంగా త్రైత సిద్ధాంత గ్రంథాలు చదివి దేవుడి జ్ఞానం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇంటింటి ప్రచారంలో ముత్తవరపు శైలజ,వంగాల మహేష్,విజయ,జాస్తి శివరామకృష్ణ,నర్సింహారావు పాల్గొన్నారు.