పారాలింపిక్స్ షూటింగ్లో అవనికి గోల్డ్
Mbmtelugunews//పారిస్, ఆగష్టు 31:పారా షూటర్ అవనీ లేఖర ..అద్భుతం చేసింది.ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్ట్రెచ్ 1లో బంగారుపతకం సాధించింది.దాంతో రెండోరోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్లయింది.టోక్యో పారాలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో పసిడి గెలిచిన 22 ఏళ్ల రాజస్థాన్ అమ్మాయి అవని.. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ లో కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.ఇప్పుడు పారిస్ పారాలింపిక్స్ లో నూ అదే జోరు కొనసాగించి,పసిడి పతకం పట్టింది. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురి కావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి.అప్పటి వరకు ఆమె లోకం వేరు! చదువు తప్ప వేరే ధ్యాస లేదు.కానీ 2015 ఆమె కెరీర్ను మలుపు తిప్పింది.వేసవి సెలవుల్లో మొదట ఆర్చరీ నేర్చుకున్న ఆమె..తర్వాత షూటింగ్కు మళ్లింది.ఆ నిర్ణయమే ఆమెను పారాలింపిక్స్ లో విజేతగా నిలబెట్టింది. మొదట టోక్యో, ఇప్పుడు పారిస్లో వరుస పారా లింపిక్స్ లో ‘బంగారు’ కొండగా నిలిచింది. “కారు ప్రమాదం తర్వాత రెండేళ్లు పాఠశాలకు వెళ్లాను. కానీ చదువే కాక ఇంకా ఏదో సాధించాలనే తపన పెరిగింది.అప్పటి వరకు ఏ ఆటల్లోనూ ప్రవేశం లేదు. ఇండోర్ గేమ్ కావడంతో సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో 2015లో షూటింగ్ మొదలుపెట్టా.ఆసక్తి పెరగడంతో ఇదే కెరీర్ అయింది” అని ఓ సందర్భంలో అవని వెల్లడించింది.ఈ మార్చిలో ఆమెకు పిత్తాశయానికి శస్త్ర చికిత్స జరిగింది.అవన్నీ దాటుకొని పతకాన్ని నిలబెట్టుకుంది.