హైదరాబాద్,జులై (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:*మీ పిల్లలు వారి పాఠశాలల్లో ఇస్తున్న అసైన్‌మెంట్లలో భాగంగా కాగితాలను అతికించడానికి, వివిధ వస్తువుల తయారీకి కృతిమ జిగురును ముఖ్యంగా సూపర్ గ్లూను అధికంగా వాడుతున్నారా..? మీ ఇంట్లో పాన్‌లు(కిళ్లీలు) ఎక్కువగా తింటుంటారా…? అయితే ఈ రెండు సందర్భాల్లోనూ మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే సూపర్‌గ్లూ, పాన్‌లో వాడే సున్నంలోని రసాయనాల కారణంగా పిల్లలకు కంటి సమస్యలు వస్తున్నట్లు తేలింది. వీటివల్ల పెద్దల దృష్టిపైనా ప్రభావం పడుతున్నా… పిల్లలే ఎక్కువగా బాధితులుగా మారుతున్నట్లు ఓ అధ్యయనంలో గుర్తించారు. రసాయనాలతో పెద్దలు, పిల్లల్లో తలెత్తుతున్న కంటి సమస్యలపై నారాయణ నేత్రాలయతో కలిసి ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య సంస్థ(ఎల్వీపీఈఐ) అధ్యయనం చేసింది. అందులో తేలిన కీలక అంశాలను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ ఆఫ్తల్మాలజిస్టు డాక్టర్ స్వప్న షాన్‌బాగ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘‘మా ఆసుపత్రులకు వచ్చిన 271 మంది పిల్లలు, 1,300 మంది పెద్దలపై అధ్యయనం చేశాం. కంటికి తీవ్ర గాయాలైన వారిలో పెద్దల్లో 80%, పిల్లల్లో 60% మంది ఉన్నారు. వీరిలో సున్నం, గ్లూ, ఇతర క్షారాల ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్న పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం.* *సూపర్‌గ్లూను పిల్లలు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఆ చేతులతోనే ముక్కును, కళ్లను రుద్దుకుంటున్నారు. ఫలితంగా వాటిలోని క్షారాలు కంటి రెటీనాను దెబ్బతీస్తాయి.* *కార్నియల్‌లో కీలకమైన లింబస్ అనే భాగమూ దెబ్బతింటుంది. ఇలాంటి వారికి స్టెమ్‌సెల్ మార్పిడి, కార్నియల్ గ్రాఫ్ట్‌లాంటి శస్త్ర చికిత్సలు అవసరం అవుతాయి.* *ఆసుపత్రులకు వచ్చిన పిల్లల కళ్లను పరీక్షించగా… 17% మందిలో టపాసుల గాయాల ఆనవాళ్లు, మరో 14% మందిలో సూపర్‌గ్లూ ఉన్నట్లు గుర్తించాం. తక్కువ గాయాలున్న 60% మంది పిల్లలు చికిత్సలతో కోలుకున్నారు’’ అని డాక్టర్ స్వప్న వివరించారు.*
*తస్మాత్ జాగ్రత్త*
*సూపర్‌గ్లూను పిల్లల చేతికి ఇవ్వకూడదు. ఏమైనా అతికించిన వెంటనే వారు చేతులను శుభ్రంగా కడుక్కునేలా చూడాలి.*
*టాయిలెట్లు, ఫ్లోర్‌లను శుభ్రం చేయడానికి వినియోగించే క్లీనర్లు, యాసిడ్లను పిల్లలకు దూరంగా పెట్టాలి. వాటిని పెద్దలూ కళ్లద్దాలు, మాస్క్‌లు ధరించి ఉపయోగించాలి.*
*షాపుల్లో విక్రయించే సున్నం ప్యాకింగ్ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.*
*కంటికి ఏదైనా గాయమైనా, సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే 60% మంది 24 గంటల తర్వాతే స్పందిస్తున్నారు. దీనివల్ల గాయం తీవ్రత పెరిగి, చూపు దెబ్బతినే ప్రమాదముంది.*