గూడూరులో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సభలో ఇరువురి మధ్య వాగ్వివాదం.
ఉద్రిక్తంగా మారడంతో సందీప్ రెడ్డిని సభ నుంచి బయటకు పంపిన పోలీసులు.
బీబీనగర్:జనవరి29, (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మండలంలోని గూడూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ జడ్పీచైర్మన్ సందీప్ రెడ్డి ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వ్యక్తిగత దూషనలకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిని బయటకు పంపించారు. అంతకుముందు జడ్పీచైర్మన్ మాట్లాడుతూ రైతుబంధు, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అన్నారు. ఇటీవల బొమ్మలరామారం మండల కేంద్రంలో రైతుబంధు రాలేదని అడిగితే చెప్పుతో కొడుతా రాలేదంటే అని అనడం సబబు కాదని అన్నారు. అనంతరం మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సొంత గ్రామానికి రోడ్డు వేసుకోలేని దద్దమ్మ నాపై విమర్శలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి పేరు లేకుండా కనీసం వార్డు మెంబరుగా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. దీంతో జడ్పీచైర్మన్ అడ్డు తగలడంతో అసహనానికి లోనైన కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజీ మీదకు వెళ్లడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో సందీప్ రెడ్డిని బయటకు పంపించాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం సందీప్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే మంత్రి నాపై వ్యక్తిగత దూషనలకు దిగడం సరికాదని, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులనే ప్రారంభిస్తున్నారు తప్ప కాంగ్రెస్ అభివృద్ధి పనులేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.



