మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల వ్యవసాయంలో మార్పులు రైతులు గమనించాలి
Mbmtelugunews//కోదాడ మార్చి 04(ప్రతినిధి మాతంగి సురేష్):
*అగ్గి తెగులు*
గత వారం రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, చలి పెరగడం వల్ల అగ్గి తెగులు వృద్ధి ఎక్కువ అయింది.
మొదట ఆకుల పైన నూలు కండే ఆకారంలో ఎర్రని మచ్చలు ఏర్పడి తర్వాత, గోధుమ రంగు మచ్చలు గా మారిపోతాయి.
మొదటి దశలోనే నివారించకపోతే క్రమంగా కంకుల మెడపై నల్లని మచ్చలు ఏర్పడి, కంకులలోకి పోషకాలు అందకపోవడం వల్ల మెడలు విరిగిపోయి, వేలాడుతూ, గింజలు తాలు గా అయిపోతాయి, ఒకవేళ గింజలు ఏర్పడిన అవి మిల్లు పట్టించినప్పుడు నూకగా మారిపోతాయి.
నివారణకి అగ్గి తెగులు గుర్తించిన వెంటనే యూరియా వేయటం ఆపేయాలి. అలాగే పొలంలో మరియు గట్ల మీద ఉన్న కలుపు మొత్తాన్ని తీసేయాలి,
చివరగా ట్రై సైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథాయిలిన్ 1.5 ml లేదా కాసుగామైసిన్ 2.5 ml లేదా ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ + టేబ్యు కొనజోల్ 0.8 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
*సుడి దోమ*
గోధుమ రంగు దోమ మరియు తెల్ల వీపు దోమ కు చెందిన పిల్ల మరియు పెద్ద దోమలు నీటి పై భాగంలో, దుబ్బుల మొదల్ల దగ్గర నుండి రసం పీల్చడం వలన పైరు లేత పసుపు రంగుకు మారుతుంది, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో గమనిస్తే దోమలు నీళ్ల మీద తెట్టెలుగా తేలాడుతూ కనిపిస్తుంటాయి, పైరు సుడులుసుడులుగా వలయాకారంలో ఎండిపోతూ ఉంటుంది, ఉధృతి ఎక్కువైతే పొలం ఎండిపోయి పడిపోవడం వల్ల గింజలు పాలు పోసుకోవు లేదా మిల్లు పట్టించినప్పుడు నూక గా కావడం జరుగుతుంది.
సుడిదోమను గమనించినప్పుడు యూరియా వేయటం ఆపేయాలి, సింథటిక్ పైరీత్రాయిడ్ పురుగుమందులను పిచికారి చేయకూడదు, పొలాన్ని ఆరబెడుతూ ఉండాలి.
చివరిగా డైనటో ఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా బ్యూప్రో పెజిన్
1.6 ml లేదా పైమెట్రోజెయిన్ 0.6 గ్రాములు లేదా ఫ్లోనికామైడ్ 0.4 గ్రాములు దుబ్బుల మొదల్లు తడిచేలాగా పిచికారి చేయాలి
*కంపు నల్లి*
ఈ పురుగు ఉదయం, సాయంత్రం సమయంలో దుబ్బుల మీద తిరుగుతూ గింజ పాలు పోసుకునే దశలో గింజల నుండి పాలు పీల్చేయడం వల్ల గింజలపై గోధుమ రంగు నుండి నల్లటి మచ్చలు ఏర్పడతాయి మరియు గింజలు పాలు పోసుకోక తాలుగింజలు అవుతాయి.
ఉదయము లేదా సాయంత్రం సమయంలో వీటి నివారణ చర్యలు తీసుకోవాలి
క్లోరిఫైరీఫాస్ 2.5 ml లేదా మలాథియాన్ 2 ml నీటికి కలిపి కంకులు, దుబ్బులు మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలి.