రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి న మేక కి అరుదైన ఆర్థోపెడిక్ ఆపరేషన్
ఆర్థోపెడిక్ ఆపరేషన్ తో విరిగిన ఎముకలను అతికించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య
కోదాడ ఆగస్టు 18(ప్రతినిది మాతంగి సురేష్): మునగాల మండల పరిధిలోని భారఖత్ గూడెం గ్రామానికి చెందిన మాదాసు అంజయ్య పదిరోజుల క్రితం తన మేకలను రోడ్డు వైపు మేపుతుండగా మూడు నెలల మేకపిల్ల కారు తగిలి ముందు కాలు వెనుక కాలు విరిగాయి.స్థానికంగా కాళ్లకు పసరు కట్టు కట్టించగా ఈరోజు వెనుక కాలు కట్టు విప్పి చూస్తే బొక్క విరిగిన చోట చర్మం ఊడి కండ చీకు పట్టి బొక్క తేలి ఇన్ఫెక్టన్ సోకి అదనంగా గుర్రం వాతం కూడా జతకావడం తో వైద్యం నిమిత్తం సోమవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు వచ్చారు.

మేక పిల్లను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, సెప్టిక్ అయ్యిన విరిగిన కాలుకు తోడు గుర్రం వాతం కూడా సోకడం వల్ల పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి విరిగిన కాలి ఎముకల ఆపరేషన్ కై స్థానిక పట్టణ ఆర్థోపెడిక్ సర్జన్ డా చంద్రమోహన్ ని సంప్రదించి వారి సూచనల మేరకు విరిగిన ఎముకలను కలుపుతూ డ్రిల్లింగ్ మిషన్ తో పిన్నింగ్ వేసి అదనంగా స్టీల్ వైర్ తో ఎముకలను కలుపుతూ ముడి వేసి విరిగిన ఎముకలను విజయవంతంగా అతికించనైనది. పదిరోజుల పాత గాయం కావడం వలన మెరుగైన మందులు అందించి ప్రతీ రోజు కట్టు తొలగిస్తూ తిరిగి వేయించుకోవాలని, గుర్రం వాతం నివారణకు మేకను చీకటి గదిలో ఉంచి రోజంతా వెలుతురు పడకుండా సూచించిన మందులు వాడాలని యజమానికి జాగ్రత్తలు చెప్పారు .పోయింది అనుకున్న తన మేక కాలు తిరిగి అతికే అవకాశం దక్కడంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. కాలు ఆపరేషన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు సిబ్బంది రాజు, చంద్రకళ, అఖిల్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.



