కోదాడ,ఆగష్టు 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బుధవారంఉదయం11గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర బండపాలెము నందు స్యయంభువుగా వేంచేసియున్న శ్రీదేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవస్థానములో శ్రవణ నక్షత్ర యుక్త ప్రతిమాస శ్రీవారి “శాంతికల్యాణము” అత్యంత వైభవముగా,కన్నులపండువుగా భక్తజనుల ఆనందోత్సాహాల నడుమ జరిగినది.పెండ్లికాని వారికి పెండ్లిండ్లు జరుగుటకు, సంతానార్థులకు సత్సంతానము కొరకు మరియు ఇతరములైన సద్వాంఛల కొరకు సంకల్పింపబడిన ఈ మాసకల్యాణము దాదాపు రెండు గంటలకు పైగా శ్రీ పాంచరాత్రాగమ సిద్ధాంతము ప్రకారము వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తముగా సాగినది.

వల్లభి సన్నాయి వాద్యాలనడుమ వీనులవిందుగా జరిగినది. కల్యాణానంతరము స్వామి వారికి మహానివేదన,మంగళాశాసనము,తీర్థప్రసాద వినియోగము,పీటల మీద కూర్చున్న దంపతులకు భోజనాలు మొదలైన కార్యక్రమాలు దిగ్విజయముగా జరిగినవి. అనంతరం ఆలయ అర్చకులు చైర్మన్ ముడుంబై వేణుగోపాలచార్యులు మాట్లాడుతూ తమ్మర బండపాలెంలో స్వయంభుగా వెలసిన శ్రీదేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఎంతో మయమగల దేవుడని ఇక్కడకు వచ్చిన వారి కోరికలు కొంగు బంగారం లాగా తీరుతున్నాయని ఎంతోమందికి సంతానం లేని వారికి సంతానం కలిగిందని భక్తులకు అనేక రకాలుగా మేలు జరుగుతున్నాయని స్వయంగా వారే వచ్చి మాకు తెలుపుతున్నారని అన్నారు.ములుగు సిద్ధాంతి తన గ్రంథంలో జీవితంలో ఒక్కసారి అయినా తమ్మర బండపాలెం లో గల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలని స్వయంగా రాసుకున్నారని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఆలయ అర్చకులు,చైర్మన్ ముడుంబై వేణుగోపాలాచార్యులు,సహాయార్చకులు ముడుంబై లక్ష్మణాచార్యులు, ముడుంబై వరదరాజ స్వామి,సహాయకులు ఎన్సీ సుదర్శనాచార్యులు,ఎన్సీ రంగాచార్యులు,సేవకులు పాల్గొన్నారు.