*🍥ముంబయి,అక్టోబర్ 14(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి పతకాల కోసం పోటీపడే వేదిక.. ఒలింపిక్స్. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో చాలా క్రీడలే నిర్వహిస్తున్నా క్రికెట్ లేదనే ఓ లోటు మాత్రం ఉండేది*
*🌼కానీ ఒలింపిక్స్‌లోకి క్రికెట్ వచ్చేసినట్లే! 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం ఆమోదించింది. క్రికెట్ (టీ20)తో పాటు బేస్‌బాల్- సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లక్రాస్ (సిక్సస్), స్క్వాష్‌ను కూడా ఒలింపిక్స్‌లో ఆడించాలనే ప్రతిపాదనలకు ఎగ్జిక్యూటివ్ బోర్డు పచ్చజెండా ఊపింది. ఇక ఆదివారం ఆరంభమయ్యే ఐఓసీ సదస్సులో ఈ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహిస్తారు*
*🛟ఈ ఓటింగ్‌తో అధికారికంగా ఒలింపిక్స్‌లో క్రికెట్ పునఃప్రవేశం లాంఛనమే. టీ20 ఫార్మాట్లో ఆరు జట్ల పోరుగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశముంది. కాంపౌండ్ ఆర్చరీకి మాత్రం ఈ బోర్డు నుంచి ఆమోదం లభించలేదు. 2028 ఒలింపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీని ప్రవేశపెట్టాలని నిరుడు ఐఓసీకి ప్రపంచ ఆర్చరీ ప్రతిపాదన పెట్టినా ఫలితం లేకపోయింది. దిగ్గజ ఆర్చర్ జ్యోతి సురేఖ కాంపౌండ్ ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆసియా క్రీడల్లో భారత్‌కు అయిదు స్వర్ణాలు సహా 7 పతకాలు కాంపౌండ్ ఆర్చరీలో వచ్చాయి*



