కోదాడ,ఏప్రిల్ 24(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:టక్కుటమారి హామీలతో,వాగ్దానాలతో ముఖ్యంగా రైతాంగాన్ని నమ్మించి,వంచించడంలో రేవంత్ రెడ్డి గారడీ మాస్టర్ లకు సరిజోడి అయ్యాడని తెలుగు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు విమర్శించారు.నడిగూడెం మండల కేంద్రంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్పష్టంగా డిసెంబర్ 9వ తేదీని ప్రస్తావించి మరీ రేవంత్ రెడ్డి రైతు బందు,రెండు లక్షల రైతు రుణం మాఫీ చేస్తానని వాగ్దానం చేసాడని గుర్తు చేశారు.తీరా గెలిచి ముఖ్యమంత్రి ఐన తరువాత వంద రోజులని,ఆగష్టు 15 తరువాత అని గారడీ మాస్టర్ లా మాట్లాడటం తగదని చెప్పారు.ప్రజలు కొడుతున్న జేజేలు తన వాగ్దాటికే గాని తన పరిపాలనకు కాదన్న నిజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత త్వరగా గ్రహిస్తే తనకు అంత మంచిదని హితువు పలికారు.ఇలాగే తన వాగ్దాటిని చూపిస్తూ,వాగ్దానాలను విస్మరిస్తే భవిష్యత్తులో ప్రజలు రేవంత్ రెడ్డిని పిట్టల దొరలా భావించే ప్రమాదం లేకపోలేదని చెప్పారు.ఎంత కష్టమైనా,నష్ట మొస్తున్నా సాగు చేసి పంట పండించి, అన్నం పెడుతున్న రైతాంగాన్ని నమ్మించి,మోసం చేస్తే పుట్టగతులుండవనే నిజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించాలని చెప్పారు.లేనిపక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రైతాంగం కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



