కోదాడ,మే 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పట్టణం లోని ప్రభుత్వాసుపత్రి ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం ఆకస్మికంగా పరిశీలించారు.అనంతరం ఆసుపత్రిలో జరుగుతున్న వివిధ జాతీయ కార్యక్రమాలపై ఆరోగ్య సిబ్బందితో వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ వడదెబ్బ గురించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.వడదెబ్బ లక్షణాలు తీసుకోవలసిన జాగ్రతల గురించి వివరించారు.వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత,వేడిగాలులు కారణంగా వడదెబ్బ (సన్ స్ట్రోక్),డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉందని,సాధారణంగా వచ్చే వ్యాధులు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకమే అని అన్నారు.వడదెబ్బ లక్షణాలు ముఖ్యంగా చెమట పట్టకపోవడం,వణుకు పుట్టడం లాంటివి ఉంటాయని,వేసవికాలంలో నీరు,పళ్ళ రసాలు,కొబ్బరినీళ్ళు,మజ్జిగ ద్రవపదార్థాలుఎక్కువగా తీసుకోవాలి అని కోరారు.లేతవర్ణం,తేలికైన,కాటన్ దుస్తులు ధరించాలని,రోజూ కనీసం 15 గ్లాసుల నీళ్ళు త్రాగాలని పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వటం అవసరమని,శుభ్రంగా రెండు పూట్ల స్నానం చేయాలని భోజనం మితంగా చేయాలని,ఎండవేళ ఇంటి పట్టునే ఉండండని బయటికి వెళ్ళాల్సి వస్తే గొడుగు,టోపి వంటివి తీసుకొని వెళ్ళాలని,ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలని,ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలని సూచించారు.వేసవిలో మండు వేసవిలో,తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదని,సూర్యకిరణాలకు,వేడిగాలికి గురికారాదని,రోడ్ల మీద చల్లని,రంగు పానీయాలు త్రాగరాదని,రోడ్ల మీద అమ్మే కలుషిత ఆహారం తినరాదని మాంసాహారం తగ్గించాలి,మద్యం సేవించరాదని,ఎండ వేళల్లో శరీరంపై భారం పడు శ్రమ గల పనులు చేయరాదని,నలుపు దుస్తులు,మందముగా వున్న దుస్తులు ధరించరాదని కోరారు.ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి వచ్చినవారికి ప్రథమ చికిత్స వెంటనే చేయాలని,దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలని,చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలని,శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చేస్తుండాలని,ఫ్యాను గాలి/చల్లని గాలి తగిలేలా ఉంచాలని,ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూగోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణము (ఓ.ఆర్.ఎస్.) త్రాగించవచ్చని, వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదని తెలిపారు.వీలయినంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని అన్నారు.ప్రభుత్వాసుపత్రిలో కాన్పుల సంఖ్య పెంచాలని,సాధారణ కాన్పుల కొరకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిబ్బంది పూర్తిస్థాయిలో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.బిపి షుగర్ వ్యాధిగ్రస్తుల రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్డేట్ చేయాలని కోరారు.అన్ని జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్,ప్రోగ్రాం అధికారులు వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ పెండం వెంకటరమణ,జిల్లా ఆసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జయ,సంక్రమిత వ్యాధుల అధికారి డాక్టర్ నజియా,ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ నాయక్ ,డెమో అంజయ్య,కిరణ్,సతీష్ పాల్గొన్నారు.
వడదెబ్బ పట్ల అప్రమత్తం గా ఉండాలి:జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం
RELATED ARTICLES



