ప్రతిఘటన పోరు కెరటం
లింగన్నకు విప్లవజోహార్లు !
కోదాడ,జులై 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక లాల్ బంగ్లాలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు,భద్రాది కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పూనెం లింగన్న 5 వ,వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి మాట్లాడుతూ కామ్రేడ్ లింగన్న ఆదివాసి గుడిసెల్లో ఉదయించిన అరుణ కిరణం అని అన్నారు.సమాజ మార్పు కై సాగే పోరాటాలలో నేను సైతం అంటూ ప్రతిఘటన పోరుబాటలో కదిలిన వ్యక్తి,ఆదివాసీల హక్కుల కోసం,పోడు భూముల పరిరక్షణ కోసం ఇల్లందు ప్రాంతంలో పీడిత ప్రజల పక్షాన నిలిచిన పోరాడిన విప్లవ రణ తరంగం లింగన్న అని అన్నారు.2018 జులై 31న గుండాల ప్రాంతంలో రోళ్ల గడ్డ అడవిలో పోలీసుల బూటకపు ఎన్ కౌంటర్ లో అమరత్వం చెందాడని గుర్తు చేశారు.పీడిత,తాడిత వర్గాల కోసం,అటవీ హక్కుల సంరక్షణ కోసం ప్రతిఘటన పోరాట పంథా వెలుగులో సమాజ విముక్తికై సాగిన బాటసారి అని కొనియాడారు.అతను అస్తమించినా అతని ఆశయ స్ఫూర్తి నిత్యం ప్రజలను చైతన్య పరుస్తుందని,దోపిడీ పాలకవర్గాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించమని ముందుకు కదిలిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎప్ టియు జిల్లా సహాయ కార్యదర్శి వక్కవంతులు నరసింహారావు, అలుగుబెల్లి సత్యనారాయణరెడ్డి,విజయ్,మైసయ్య, రవితేజ,నరసింహారావు,కొండలు,ఖాసిం,రామారావు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.