శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం..రూమ్స్‌లో సీసీ కెమెరాలు పెట్టి..
Mbmtelugunews//హైదరాబాద్,ఆగష్టు 28: శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం తాజాగా వెలుగు చూసింది.హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు.రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి బాధితులను ఓయో హోటల్ నిర్వాకుడు బెదిరిస్తున్నాడు.హోటల్ నిర్వాహకుడి బాధను ఎదుర్కొంటున్న ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు హోటల్‌ను తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు వద్ద నుంచి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.ఘటనపై కేసు నమోదు చేసుకుని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఓయో రూమ్స్ ఎక్కువగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలోనే దీనిని క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ విచ్చల విడగా ఓయో హోటళ్లు వెలిశాయి.ఇవి యువతీయువకులు ఏకాంతంగా గడిపేందుకు బెస్ట్ లొకేషన్‌గా మారుతున్నాయి.కొన్ని ఓయో రూమ్స్ డ్రగ్స్‌కు కూడా కేంద్రాలుగా మారుతున్నాయి.ఆన్ లైన్ లో రూమ్స్ బుక్ చేసుకుంటున్న యువత గదులలో విచ్చల విడిగా మద్యం సేవిస్తూ..డ్రగ్స్ తీసుకుంటున్నారు.గదులలో ఇద్దరికి మించి మూడవ వ్యక్తికి అనుతించకపోవడంతో వీటి పట్ల యువతీ,యువకులు ఆకర్షితులవుతున్నారు.ఇలాంటి వ్యవహారాలన్నింటినీ ఓయో హోటల్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు.
ఆన్ లైన్ బుకింగ్స్ చేసే హోటళ్లు కొన్ని ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నాయి . ఓయో లాడ్జీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెబితే నిర్వాహకులు ఏకంగా రూమ్స్‌లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. యువతీయువకులు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చూపించి వారిని చెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. బయటపడితే ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోనని అడిగినంత డబ్బును ఏదో ఒకరకంగా తీసుకొచ్చి యువతీయువకులు ముట్టజెబుతున్నారు. శంషాబాద్‌లో జరుగుతోంది ఇదే. గదుల కోసం వచ్చే వారి ఆధార్ , ఇతర గుర్తింపు కార్డులు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నా నిర్వాహకులు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఓయో రూమ్స్ పట్ల సమాజంలోనూ ఒక రకమైన భావన ఏర్పడింది. ఇవి అసాంఘిక కార్యకలాపాలకు నిలయమని పేరు రావడంతో దంపతులు ఎవరైనా సరే.. ఈ ఓయో రూములకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.