ప్రధాన రోడ్ల వెంబడి అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తా:మున్సిపల్ కమిషనర్ ఎ.రమాదేవి
:కొంతమంది మున్సిపల్ అధికారులకు చేతులు తడుపుతున్నట్లు ఆరోపణలు.
:చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు.
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):ఇటీవల కురిసిన భారీ వర్షంతో కోదాడ పట్టణంలో వరద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.పట్టణంలోని ప్రతి కాలనీలో వరద తీవ్రత కనిపించి,అనేకమంది ఇండ్లలో నీరు చేరి హరిగోసపడ్డారు.ఇద్దరు ప్రాణాలు కోల్పోగా అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు.దీనికి కారణం అక్రమ నిర్మాణాలతో పాటు,పట్టణంలోని ప్రధాన డ్రైనేజీ కాల్వ పూర్తిగా చెత్త చేరి సరిగా నీళ్లు పోవడం లేదని పలుమార్లు ప్రచారమాధ్యమాలలో రాగా మున్సిపల్ అధికారులు పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టినారు అదే సమయంలో వరదలు రావడంతో డ్రైనేజీలో నీరు ప్రవహించడానికి వీలు లేకపోవడంతో,వరద నీరు రహదారుల వెంట ఇండ్లలోకి చేరాయని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో అలర్ట్ అయిన మున్సిపల్ అధికారులు ప్రధాన డ్రైనేజీ కాల్వ పూడికతీత పనులు చేపట్టారు.పట్టణంలోని హుజూర్ నగర్ రహదారి వెంట ఉన్న వివిధ దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్ ల ముందర డ్రైనేజీ పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేశారు.కానీ షాపింగ్ కాంప్లెక్స్ ల ముందు ఉన్నటువంటి మెట్లను నిబంధనలకు విరుద్ధంగా డ్రైనేజ్ పై మెట్లను నిర్మించారు.వాటిని మాత్రం మున్సిపల్ అధికారులు తొలగించకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి మెట్లు నిర్మించారు.మరి కొంతమంది డ్రైనేజీ పైనే ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మెట్లు నిర్మించారు. కానీ అధికారులు ఈ మెట్లు తొలగించకుండా,వదిలేస్తూ ఉండడంతో మెట్ల కింద నిల్వ ఉన్న చెత్త వల్ల డ్రైనేజీ మళ్లీ ఊడిపోతున్నాయని పలువురు వాపోతున్నారు.అధికారులు తెలిసి కూడా ఇలా చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని పట్టణ ప్రజల ప్రశ్నిస్తున్నారు.దుకాణదారులు,షాపింగ్ కాంప్లెక్స్ ల యజమానులతో కొంతమంది అధికారులు లాలూచీ పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కట్టిన మెట్లను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
గత అధికారుల పని తీరుతోనే అక్రమ కట్టడాలు…!
కోదాడ పట్టణంలో గత అధికారుల పనితిరుతోనే అక్రమ కట్టడాలు ఏర్పాటు అయ్యాయని పట్టణ ప్రజలు అంటున్నారు.కోదాడ పట్టణం మొదట గ్రామ పంచాయతీ గా ఏర్పడిన తరువాత కాలక్రమేణా మున్సిపాలిటీగా ఏర్పడింది.నాటి అధికారుల పని పనితిరుతోనే అక్రమ కట్టడాలు నిర్మించారు అని ప్రజలు అంటున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోరుతున్నారు.
నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం:మున్సిపల్ కమిషనర్ ఎ.రమాదేవి
గతంలో ప్రజలు అక్రమంగా డ్రెయినేజీ నిర్మాణాలపై మెట్లు నిర్మించిన వారికి నోటీసులు జారి చేసి చర్యలు తీసుకుంటాం.పట్టణ ప్రజలు ఎవరైనా పర్మిషన్ తీసుకున్న నిబంధనల మేరకు కట్టడాలు నిర్మించుకోవాలి.డ్రెయినేజీ వంటి నిర్మాణాలపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దు.ఇటీవల పట్టణంలో వచ్చిన వరదలకు అక్రమ కట్టడాలు ప్రధాన కారణం. కావున ప్రజలు మున్సిపల్ అధికారులకు సహకరించాలని అన్నారు.