ప్రపంచ అందాల పోటీలను నిలిపివేయాలి
:అరెస్టు చేసిన పివైఎల్,పిఓడబ్ల్యూ,పిడిఎస్యు,ప్రజా సంఘాల నాయకత్వాన్ని విడుదల చేయాలి
Mbmtelugunews//కోదాడ,మే 12(ప్రతినిధి మాతంగి సురేష్):ప్రపంచ అందాల పోటీలను హైదరాబాదులో నిర్వహిస్తున్నారని వీటిని తక్షణమే నిలిపివేయాలని ఆందోళన నిర్వహిస్తున్న పివైఎల్,పిఓడబ్ల్యు నాయకత్వాన్ని పివైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నర్సమ్మను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ధరవత్ రవి అన్నారు.స్థానిక లాల్ బంగ్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ధరవత్ రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నదని,ఎవరు అప్పులు ఇవ్వడం లేదని,అప్పు పుట్టడం లేదని ఒకపక్క సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటూనే మరొక వైపు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ ప్రపంచ అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను,ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా,ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా,విద్యార్థి,యువజన,కార్మిక,రైతుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తూ దుబారా ఖర్చులు చేయడం సరికాదన్నారు.రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యo వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని వారన్నారు.పోలీసులు ప్రజా సంఘాల నాయకత్వాల పట్ల రాష్ట్రంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని,ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పకుండా నిరాకరించే నిర్బంధ పరిస్థితి రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే అరెస్టు చేసిన పివైఎల్,పిఓడబ్ల్యూ,పిడిఎస్యు,ప్రజా సంఘాల నాయకత్వాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఒకవైపు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటే నేడు రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించి దేశానికి ఏం సంకేతం ఇవ్వాలని చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వెంటనే అందాల పోటీలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.