నైతిక విలువలతో కూడిన విద్యను అందించిన విద్యా సంస్థ సిసిఆర్.
:50 ఏళ్లుగా వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దిన విద్యాసంస్థ.
:విద్యా కుసుమాలను వికసింప చేసిన అత్యుత్తమ విద్యాసంస్థ సిసిఆర్.
:ఏసుప్రభువు బోధనలే విద్యాసంస్థకు పునాది.
:అంబరాన్ని అంటిన సిసిఆర్ స్వర్ణోత్సవ వేడుకలు.
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): పాఠశాల ఆవిర్భావం నాటినుండి నేటి వరకు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థులను తీర్చు దిద్దుతున్న విద్యా సంస్థ సేంట్ జోసఫ్ సిసిఆర్ అని బిషప్ ధమన్ కుమార్ అన్నారు. శనివారం కోదాడ సిసిఆర్ విద్యా నిలయంలో పాఠశాల స్వర్ణోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యతోనే వినయం, క్రమశిక్షణ అలవడుతాయని సిసిఆర్ ఉపాధ్యాయులు ఉన్నత విలువలతో కూడిన విద్యను గత 50 ఏళ్లుగా విద్యార్థులకు బోధించారన్నారు. ఏసుప్రభు బోధనలు ప్రేమా, శాంతి, కరుణా, జాలి, దయ పాఠశాల స్వర్ణోత్సవాలకు ఆనాటి పూర్వ విద్యార్థులు చేరుకోవడానికి ప్రధాన భూమిక అన్నారు. ఎంతోమంది త్యాగమూర్తుల సేవల ఫలితంగానే దిగ్విజయంగా ఈ పాఠశాల నేటి వరకు కొనసాగుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన క్రమశిక్షణ పట్ల శ్రద్ధ వహించాలన్నారు.

కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో సిసిఆర్ పాఠశాల సఫలీకృతమైందన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పాఠశాల తల్లిదండ్రుల అభిమానాన్ని పొందిందని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆన్ జ్యోతి మాట్లాడుతూ పాఠశాలలో గత 50 ఏళ్ల నుండి వేలాదిమంది విద్యార్థులు పదవ తరగతి పూర్తి చేసి దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. సంస్థ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఉన్నత ప్రమాణాలు, విలువలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పాఠశాలలో అమలు చేస్తున్నామని అన్నారు. పాఠశాల నివేదికను సమర్పించారు. స్వర్ణోత్సవాల సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, సుపీరియర్ జనరల్ జపమాల వట్టే, ప్రోవిన్షియల్ సుపీరియర్ ఉడుముల శేరీలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



