బాధితులకు బిఆర్ఎస్ భరోసా
:అవసరమైతే బాధితుల పక్షాన కోర్టుకు
:బాధితులకు గుండె ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే బొల్లం
Mbmtelugunews//కోదాడ, జనవరి 04(ప్రతినిధి మాతంగి సురేష్): పెద్ద చెరువు ను ఆక్రమించుకున్నారని వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు 372 మందికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.నోటీసుల జారీ తో కంటిమీద కునుకు లేకుండా భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ పరిధిలోని సాయిబాబా థియేటర్ సమీపంలోని వీధులలో రేకుల ఇల్లు, గుడిసెలు తిరిగి బాధితులను సోమవారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గుండె ధైర్యం చెప్పి ఓదార్చారు. నోటీసులు జారీ అయిన 372 మందిలో 200 మంది దారిద్ర రేఖ దిగువ బాగానఉండి కూలీ నాలి చేసుకొనే నిరుపేదలు ఉండటం గమనార్హం. 50 సంవత్సరాల నుండి ఇక్కడే జీవిస్తున్నామని 40 గజాల స్థలంలో ఇల్లు కట్టుకొని పొట్ట కూటి కోసం కూలికెళ్తూ బతుకుతుంటే ఈ మాయదారి నోటీసులతో కంటిమీద కునుకు లేదని తమ గోడును వెళ్లబోసుకున్నారు. వేల గజాల ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని మా మీద ఈ జులుం ఏమిటని కన్నీటి పర్యంతరమయ్యారు. మమ్మల్ని చంపిన తర్వాతే మా ఇల్లు కూలగొట్టాలని మాజీ ఎమ్మెల్యే ఎదుట స్పష్టం చేశారు. ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, మీ పక్షాన న్యాయ, ప్రత్యక్షపోరాటం చేస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితులు ఆక్రమణదారులైతే ఇళ్ల నిర్మాణానికిఅనుమతులు ఎలా ఇచ్చారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. ఇంటి పన్ను నీటి పన్ను కరెంటుబిల్లులు చెల్లిస్తున్నప్పుడు ఈ విషయం ఎందుకు గుర్తుకు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. కోర్టు నోటీసుల పేరుతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు బాధితులను భయభ్రాంతులను చేయటం సమంజసం కాదన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులే బాధితుల పక్షాన నోటీసులకు సమాధానం చెప్పాలన్నారు. ఓ పక్క కోదాడ మున్సిపాలిటీ పరిధిలో అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా ఆక్రమించుకొని అపార్ట్మెంట్లు కట్టుకున్న దురాక్రమణదారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా నిరుపేదలను ఆక్రమణదారులు అనటం శోచనీయమన్నారు. మరొక్కసారి బాధితులను ఇబ్బంది పెడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. బాధితులకు అండగా ఉంటామని, మీ ఇళ్లకు నేనే భరోసా అని మాజీ ఎమ్మెల్యే బొల్లం బాధితులకు గుండె దైర్యం కల్పించారు. ఆయన వెంట టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, మాజిక కౌన్సిలర్ చింతల నాగేశ్వరరావు ముఖ్య నాయకులు ఉన్నారు.



