సమాజ మార్పుకై సమిధలైన అమరులకు విప్లవ జోహార్లు!
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 02( ప్రతినిధి మాతంగి సురేష్): కోమరబండ గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విప్లవోద్యమంలో పనిచేసి అశువులు బాసిన అమరులకు నివాళ్లు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ భూమి, బుక్తి, విముక్తి కోసం సాగిన విప్లవ పోరాటంలో అనేకమంది పోరు మార్గంలో పయనించి తమ అమూల్యమైన ప్రాణాలను తుణప్రాయంగా అర్పించారని అన్నారు. అణగారిన వారికి అండగా దోపిడీ దౌర్జన్యాల రూపుమాపేందుకు అనునిత్యం పోరు సలిపినారని, సమసమాజమే లక్ష్యంగా సాగే సమరపు దారిలో తమ నెత్తురులు ధారపోశారని వారి త్యాగాలు వెలకట్టలేనియని కొనియాడారు. విప్లవద్యమంలో పయనించి అస్తమించిన వారు నిత్యం సదాస్మరణీయులని అన్నారు. నవంబర్ నెలలోనే అనేకమంది పార్టీ అగ్రనాయకులైన కామ్రేడ్ పొట్ల రామ నరసయ్య,నీలం రామచంద్రయ్య,విద్యార్థి నాయకులు జంపాల,శ్రీపాద లాంటి ఎంతోమంది విప్లవ యోధులు ఆనాటి ఎమర్జెన్సీ చీకటిపాలనలో రాజ్యం చేతిలో హత్యగావించబడ్డారని అన్నారు. ప్రతిఘటన పోరాట నిర్మాత చండ్ర పుల్లారెడ్డి లాంటి వారు ఈ నెలలోనే అమరత్వం చెందారనిఅన్నారు. అట్లాగే ఈ జిల్లాలో జలగం జనార్ధన్, అలుగుబెల్లి వెంకట నరసయ్య, కాకి లక్ష్మారెడ్డి, వీసాల గోవిందు లాంటి అనేకమంది శ్రామిక జనం విముక్తికోసం సమరపు దారిలో తమ తుది శ్వాస వరకు పయనించారని వారి ఆశయాల సాధన కోసం పీడిత ప్రజల పక్షాన సాగే ప్రజా ఉద్యమాలలో ముందు బాగాన నిలబడటమే ఆ అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ నాయకులు మద్దెల జానయ్య, కామల్ల సైదులు, మద్దెల ప్రతాప్, కామల్లబిక్షం, వెంకన్న, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.



