కోదాడ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం..!
ప్రభుత్వం మారినా… కాంట్రాక్టర్ మాత్రం మారడా?
పెద్దవాగు పూడికతీత పనుల్లో భారీ అక్రమాల ఆరోపణలు…
“నేనే రాజు… నేనే మంత్రి” అన్నట్టుగా కోదాడలో ఒకే కాంట్రాక్టర్ పెత్తనం..!
అధికారుల మౌనం వెనుక మర్మమేంటి…?
Mbmtelugunews//కోదాడ, జూన్ 13 : ప్రభుత్వాలు మారుతున్నాయి… ప్రజాప్రతినిధులు మారుతున్నారు… కానీ కోదాడలో ఒక కాంట్రాక్టర్ ఆధిపత్యం మాత్రం ఏమాత్రం మారడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలక కాంట్రాక్టులు దక్కించుకున్న అదే వ్యక్తి, ప్రస్తుత ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతూ కోట్ల రూపాయల పనులను గుప్పెట్లో పెట్టుకున్నాడని, కోదాడ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం కోదాడ పెద్దవాగు పూడికతీత పనుల్లో జరుగుతున్న తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాగులో నుంచి తొలగించిన పూడికను శాస్త్రీయంగా తరలించాల్సిన చోట, అదే మట్టిని కొద్దిరోజుల క్రితం తీసిన మట్టిని అదే వాగు పక్కనే పోసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేపు వర్షాలు వస్తే ఆ మట్టంతా మళ్లీ వాగులోకే చేరి పూడికతీత పనులు చేసిన ప్రయోజనం లేకుండా పోతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు… ప్రభుత్వ పనుల, పూడిక పేరుతో తీసిన మట్టిని ప్రైవేట్ ప్లాట్లు, గృహ నిర్మాణాలకు విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజల అంచనా ప్రకారం ఇప్పటివరకు చాలా ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టి తరలించబడిందని, అందులో మొత్తం భాగం అమ్మకాలకే వెళ్లిందని అంటున్నారు.

ఇంత పెద్ద ఎత్తున వ్యవహారం సాగుతున్నా మున్సిపల్ అధికారులు మాత్రం కళ్లు మూసుకుని కూర్చోవడం అనుమానాలకు తావిస్తోంది. పనుల నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు ఎక్కడ? ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగమవుతుంటే బాధ్యత వహించాల్సిన అధికారులు ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
ప్రజాధనంతో చేపట్టిన పనులను కొందరి వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చుకోవడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం ఎవరిదైనా సరే కాంట్రాక్టులు మాత్రం ఒకరివే కావడం వెనుక ఉన్న శక్తులు ఎవరు? అనే చర్చ ఇప్పుడు కోదాడలో హాట్ టాపిక్‌గా మారింది.
నిన్న నిర్వహించిన కోదాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై జరిగిన చర్చ రసాభాసగా మారటం మరుసటి రోజే పూడికతీత పనుల్లో దుర్వినియోగం జరగడంపై పట్టణంలో చర్చ నీ అంశంగా మారింది.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెద్దవాగు పూడికతీత పనులపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజాధనం దోపిడీకి పాల్పడిన వారితో పాటు చూసీచూడనట్టు వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.



