కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది
:మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 04(ప్రతినిధి మాతంగి సురేష్): నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కోదాడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి కోదాడ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులకు అండగా ఉంటామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు రైతులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. పంటల సాగు ప్రారంభమయ్యే సమయంలో రైతులకు అత్యంత అవసరమైన క్రాప్ లోన్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి ఏడాది రైతులు పంట రుణాలను సులభంగా రెన్యూవల్ చేసుకునేవారని, ప్రస్తుతం మాత్రం బ్యాంకులు పాత రుణం మొత్తం అసలు, వడ్డీతో సహా పూర్తిగా చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామని చెప్పి రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, సాగు ఖర్చుల పెరుగుదల, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో లక్షల రూపాయల రుణాన్ని ఒకేసారి చెల్లించమని ఒత్తిడి చేయడం రైతులపై అన్యాయం అని పేర్కొన్నారు. బ్యాంకులపై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ సాధించలేకపోవడం వల్ల రైతులు మళ్లీ గ్రామాల్లోని ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా నిరంతరంగా లేకపోవడం, పగటిపూట కోతలు విధించి అర్థరాత్రి వేళల్లో మాత్రమే విద్యుత్ ఇవ్వడం వల్ల రైతులు రాత్రంతా పొలాల వద్ద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తీవ్ర లో-వోల్టేజ్ కారణంగా మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండడంతో రైతులపై వేల రూపాయల అదనపు భారం పడుతోందని తెలిపారు. సాగునీరు సకాలంలో అందక ఎకరాల కొద్దీ పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. అదేవిధంగా మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువుల రవాణాకు ఇచ్చే ‘ఫ్రైట్ ఆన్ లారీ (ఎఫ్ఓఎల్ )’ రాయితీని ప్రభుత్వం రద్దు చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ నిర్ణయం వల్ల పీఏసీఎస్ సొసైటీలు, డీలర్లు అదనపు రవాణా ఖర్చులు భరించాల్సి వస్తుందని, చివరకు ఆ భారం రైతులపైనే పడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎరువుల కొరత ఏర్పడి బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశామని తెలిపారు.



