సలీం షరీఫ్ కు రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం…
మూడు దశాబ్దాల అంకితభావానికి దక్కిన అరుదైన గౌరవం
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్) : విద్యా రంగంలో దాదాపు మూడు దశాబ్దాలుగా అంకితభావంతో సేవలందిస్తూ, విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, సమాజ భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి చేసిన పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్, కోదాడ గెజిటెడ్ హెడ్‌మాస్టర్ మహమ్మద్ సలీం షరీఫ్ కి రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం లభించింది. 1996 నవంబర్ 27న ప్రభుత్వ సేవలో చేరిన ఆయన ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా, ఎంఈఓ (ఎఫ్ఏసి)గా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారు. ఆయన నాయకత్వంలో పాఠశాల విద్యా ఫలితాల్లో విశేష పురోగతి సాధించింది. 2024–25లో 88 శాతం ఎస్ఎస్సి ఫలితాలు, అడ్వాన్స్డ్ సప్లీమెంటరీ లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏడుగురు విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించగా, ఒక విద్యార్థి 571 మార్కులతో జిల్లా జెడ్పి పాఠశాలల టాపర్‌గా నిలిచాడు. 2025–26లో 99 శాతం ఎస్ఎస్సి ఫలితాలు, అడ్వాన్స్డ్ సప్లీమెంటరీ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించింది. 15 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించగా, 572 మార్కులు సాధించిన విద్యార్థి కోదాడ డివిజన్ టాపర్‌గా నిలిచాడు.పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులు రాణించారు. 2025లో ముగ్గురు, 2026లో నలుగురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లు సాధించారు. 2025లో ఒకరు, 2026లో ముగ్గురు విద్యార్థులు ఐఐటి బాసరలో సీట్లు సాధించారు. ఇంటింటి ప్రచారం, బడిబాట, చదువుల పండుగ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నమోదు, నిలుపుదలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో పాఠశాలలో కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం కనీసం 155 మందికి చేరగా, డ్రాప్‌అవుట్ లేకుండా చర్యలు చేపట్టారు. తక్కువ ఖర్చు/ఖర్చులేని బోధనా పద్ధతులు, ఆడియో–విజువల్ అభ్యసనం, ప్రత్యేక సహాయక బోధన, క్రీడలు, సాంస్కృతిక, సహపాఠ్య కార్యక్రమాలను ప్రోత్సహించారు. దాతలు, పూర్వ విద్యార్థులు, సమాజ సహకారంతో పాఠశాల మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. 2002 మండల ఉత్తమ ఉపాధ్యాయ, 2007 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ, 2017, 2023 ఉత్తమ ఎంఈఓ , 2025 జిల్లా ఉత్తమ పాఠశాల పురస్కారాలతో పాటు పలు అవార్డులు ఆయన సేవలకు లభించాయి. మూడు దశాబ్దాల విద్యా సేవలకు రాష్ట్రస్థాయి గుర్తింపుగా లభించిన రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం కోదాడ విద్యా రంగానికి గర్వకారణంగా నిలిచింది.



