బాధితుల వద్దకే పోలీసులు..ఇంటి వద్దే ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు
మేళ్లచెరువు, మార్చి 16, mbmtelugunews.com//
పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ‘ఎఫ్.ఐ.ఆర్ ఎట్ డోర్ స్టెప్’ (FIR at Doorstep) కార్యక్రమంలో భాగంగా మేళ్లచెరువు పోలీసులు కీలక అడుగు వేశారు. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చే అవసరం లేకుండా, ఆమె ఉన్న చోటికే వెళ్లి కేసు నమోదు చేసి తక్షణ సాయం అందించారు.
మేళ్లచెరువు మండలానికి చెందిన మొర్రి మేకల మల్లమ్మ (55) అనే మహిళ తన ఇంటి నుండి బయటకు వెళ్తున్న క్రమంలో, అదే గ్రామానికి చెందిన మొర్రి మేకల వీరయ్య, అతని భార్య సోమమ్మ పాత గొడవలను మనసులో పెట్టుకుని ఆమెను అడ్డగించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఎలాగోలా వారి నుండి తప్పించుకున్న బాధితురాలు జరిగిన ఉదంతాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న వెంటనే మేళ్లచెరువు ఎస్ఐ పరమేష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి వద్ద నుండి ఫిర్యాదును స్వీకరించి, అక్కడికక్కడే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ ఎఫ్.ఐ.ఆర్ పత్రాన్ని బాధితురాలికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ పరమేష్ మాట్లాడుతూ.. బాధితులకు సత్వర పోలీసు సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ‘ఇంటి వద్దే ఎఫ్.ఐ.ఆర్’ కార్యక్రమం ద్వారా బాధితులు స్టేషన్ల చుట్టూ తిరిగే ఇబ్బంది తప్పుతుందని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.



