మేళ్లచెరువులో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు
- 324 మంది రోగులకు వైద్య పరీక్షలు
- రికార్డులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
మేళ్లచెరువు, మార్చి 17, mbmtelugunews.com//
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బచ్చు పద్మావతి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరంలో జనరల్ మెడిసిన్, స్త్రీల వ్యాధులు, దంత, ఎముకలు, కంటి మరియు చిన్న పిల్లల వైద్య నిపుణులు రోగులకు పరీక్షలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా తరలివచ్చిన సుమారు 324 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ తెలిపారు.
వైద్య సేవలను పరిశీలించిన కలెక్టర్:
వైద్య శిబిరం జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ స్వయంగా పర్యవేక్షించారు. రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్న ఆయన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి మాధవ్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



