అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
65 బాటిళ్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
మేళ్లచెరువు మార్చి 27, mbmtelugunews.com//:- కోదాడ మండలం నల్లబండగూడెం నుండి మేళ్లచెరువు మండలం రామాపురంకు అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఆబ్కారి పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లబండగూడెంకు చెందిన షేక్ జైనిషా అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై మద్యం తరలిస్తున్నాడన్న నమ్మదగిన సమాచారంతో హుజూర్ నగర్ ఆబ్కారి సీఐ నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నిఘా పెట్టారు.
రామాపురం శివారులో ఎస్సై లావణ్య తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టగా, నిందితుడు హోండా యాక్టివా వాహనంపై మద్యం బాటిళ్లతో పట్టుబడ్డాడు. అతని వద్ద నుండి 18 బీర్ బాటిళ్లు, 47 క్వాటర్ లిక్కర్ బాటిళ్లతో (180 ఎంఎల్) పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సాగర్, రుక్మారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



