Thursday, April 2, 2026
[t4b-ticker]

మేళ్లచెరువులో దారి తప్పిన రేషన్ బియ్యం!

మేళ్లచెరువులో దారి తప్పిన రేషన్ బియ్యం!
అక్రమ రవాణాలో పంచాయతీ ట్రాక్టర్.. చూసీచూడనట్లు రెవెన్యూ అధికారులు?
రేషన్ కోసం తండాల వాసుల పాట్లు – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.
మేళ్లచెరువు, mbmtelugunews.com,ప్రతినిధి అజయ్ :-
మేళ్లచెరువు మండలంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) అస్తవ్యస్తంగా మారింది. పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా, అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై మండల ప్రజలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఈ వ్యవహారంతో మాకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇంచార్జ్ డీలర్ల ఇష్టారాజ్యం:
మండలంలో రెగ్యులర్ డీలర్లు లేని చోట ఇంచార్జ్ డీలర్ల పెత్తనం మితిమీరిపోతోంది. బియ్యం ఎప్పుడు ఇస్తున్నారు? ఎక్కడ ఇస్తున్నారు? అనే సమాచారం సామాన్య కార్డుదారులకు అందడం లేదు. దీనికి తోడు కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు డీలర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నారని, వారు చెప్పిందే వేదంగా సాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. స్టాక్ ఎంత ఉంది? ఎంత పంపిణీ చేశారు? అనే కనీస తనిఖీలు చేసే నాథుడే కరువయ్యారు.
హేమ్లా తండా వాసుల కష్టాలు:
ముఖ్యంగా హేమ్లా తండాలోని రేషన్ కార్డుదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. బియ్యం కోసం వారు గ్రామాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. వృద్ధులు, ఒంటరి మహిళలు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి రేషన్ తెచ్చుకోవడం కత్తి మీద సాములా మారింది.
అర్ధరాత్రి అక్రమ రవాణా.. పట్టుబడ్డ ట్రాక్టర్:
కాగా, బుధవారం అర్ధరాత్రి హేమ్లా తండాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా ఉదంతం కలకలం రేపింది. గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టరులోనే రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో లబ్ధిదారుల చేరాల్సిన బియ్యం కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. పట్టుబడిన ఈ బియ్యం తిరిగి ఎప్పుడు ప్రజలకు పంపిణీ చేస్తారో, అసలు ఆ బియ్యం ఎక్కడికి వెళ్తాయో తెలియని అయోమయం నెలకొంది.
ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మండలంలో రేషన్ పంపిణీని క్రమబద్ధీకరించాలని, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular