స్నేహానికి సాక్ష్యంగా… 28 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై పూర్వ విద్యార్థులు
:ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా కొమరబండ లో 1997-98 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం..
:గురువులకు ఘన సన్మానం.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్న మిత్రబృందం.
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 02(ప్రతినిధి మాతంగి సురేష్): స్నేహం కాలానికి అతీతమని మరోసారి నిరూపిస్తూ కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండ గ్రామంలో ఆదివారం హృద్యమైన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా 1997–1998 విద్యాసంవత్సరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి వారి సేవలను కొనియాడారు. గురువులు కూడా విద్యార్థుల విజయాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తూ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. సమ్మేళనంలో పాల్గొన్న వారు తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనాటి సంఘటనలను పంచుకున్నారు. ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రజాసేవలో కొనసాగుతున్న సహచరులు ఒకే చోట కలుసుకోవడంతో కార్యక్రమం భావోద్వేగభరితంగా సాగింది.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు సమాజానికి సేవ చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఇదే తరహాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు, గురువులు, గ్రామ పెద్దలు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. స్నేహబంధం చిరస్థాయిగా కొనసాగాలని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ జ్ఞాపికల కోసం గ్రూప్ ఫొటోలు దిగారు. కార్యక్రమం ఆప్యాయత, ఆత్మీయత, ఆనందోత్సాహాల మధ్య ముగిసింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తండు మల్లయ్య, కోటేశ్వరరావు, సుధాకర్, శ్రీధర్, విద్యార్థులు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చట్టు ఉపేందర్, వార్డ్ కౌన్సిలర్ మామిడి రామారావు, బత్తుల లింగరాజు, కాలతిరిపి కృష్ణ, దేవపంగు ధనమూర్తి, జానీ, చక్రవర్తి, బాబురావు, అంజి, ఉపేందర్, హుస్సేన్, జెనీ, మాధురి, శ్రీదేవి, లలితా, రాధిక, విమల, నాగమణి, గృహలక్ష్మి, శైలజ, నాగమణి, ఆర్ నాగమణి, జానీ బేగం పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.



