కొత్తగూడెం మేజర్‌కు నీళ్లు విడుదల చేయాలని రైతుల ధర్నా..
:విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన
తక్షణమే నీళ్లను విడుదల చేయాలి
: గొండ్రియాల ఉపసర్పంచి బండ్ల రమేష్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్):అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద ఖమ్మం–కోదాడ జాతీయ రహదారిపై ఉప సర్పంచి బండ రమేష్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. కొత్తగూడెం మేజర్ 14వ నంబర్ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం బండ్ల రమేష్ మాట్లాడుతూ అనంతగిరి మండలం గొండ్రియాలకు చెందిన రైతులు.. 14వ నంబర్ కాలువ నుంచి సుమారు 22 కిలోమీటర్ల పొడవున్న కొత్తగూడెం కాలువకు నీటిని వెంటనే విడుదల చేయాలని అన్నారు. కాలువలో నీరు రాకపోవడంతో పాటు విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తాగు, సాగునీటి అవసరాల కోసం చెరువులను వెంటనే నింపాలని.. పశువులకు కూడా నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రి ఇలాకాలోనే కరువు పరిస్థితులు నెలకొనడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాలువకు నీళ్లు విడుదల చేయాలి..
విద్యుత్ కోతలు ఆపాలి..చెరువులను వెంటనే నింపాలి.. అంటూ రైతులు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పారు.దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు గంగూరి శ్రీను, జి బ్రహ్మం, బండారు రామారావు, నెల్లూరి నరేష్, రాజేష్, వరప్రసాద్, వెంకటేశ్వర్లు రైతులు పాల్గొన్నారు.



