రేవంత్ రెడ్డిది హిట్లర్ తరహా నియంతృత్వ పాలన.
:ముఖ్యమంత్రిని తక్షణమే భర్తరఫ్ చేయాలి.
:అడుగడుగున ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారనే భయంతోనే బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం.
:ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ ఎండగడుతూనే ఉంటుంది.
:కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ప్రజా సమస్యలపై (రైతులు, విద్యార్థులు, పారిశుద్ధ్యం తదితర అంశాలు) చేపట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసిన కోదాడ నియోజకవర్గ ప్రజలకు, పత్రికా విలేకరులకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షం హోదాలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే, సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడి చావును కోరుకునే స్థాయికి దిగజారారు. అసెంబ్లీ మొదటి రోజు ప్రతిపక్ష సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి లాంటి సీనియర్ మహిళా శాసనసభ్యులపై అమానుషంగా ప్రవర్తించారు. కౌరవ సభను తలపించేలా, దుశ్శాసన పర్వాన్ని గుర్తుకు తెచ్చేలా దాడి జరిగినా ముఖ్యమంత్రి కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం దారుణం. అసెంబ్లీ రెండో రోజున, ముఖ్యమంత్రే స్వయంగా కాంగ్రెస్ సభ్యులను రెచ్చగొట్టి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఫామ్ హౌస్ పైకి దాడికి ఉసిగొల్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పోలీసు ఎస్కార్ట్ ఇచ్చి మరీ దాడులకు పంపించడం రాష్ట్రంలో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితికి అద్దం పడుతోంది. మూడో రోజున ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్ష సభ్యులు నిలదీస్తుంటే, సమాధానం చెప్పలేక మూకుమ్మడిగా సస్పెండ్ చేశారు. సభకు రాని కేటీఆర్, మల్లారెడ్డి లాంటి వారిని కూడా సస్పెండ్ చేయడం వారి అజ్ఞానానికి, నియంతృత్వానికి నిదర్శనం అని, రాష్ట్రంలో ప్రస్తుతం హిట్లర్ తరహా నియంతృత్వ పాలన సాగుతోంది. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు. అసెంబ్లీ గేట్ల వద్దే ప్రతిపక్ష సభ్యుల గొంతులు నొక్కే ప్రయత్నం చేశారు. మహబూబాబాద్‌లో ధర్నా చేస్తున్న ఒక పాలిటెక్నిక్ విద్యార్థి గొంతును పోలీస్ ఇన్స్పెక్టర్ నొక్కిన ఘటన ఈ ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ట. విద్యార్థులకు స్కాలర్షిప్పులు, ఉద్యోగులకు జీతాలు లేవు. వ్యవసాయ, నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. రైతుల నెత్తిన భారం మోపేలా తీసుకొచ్చిన 22A జీవో పై, కరెంటు, సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ఉండేందుకే బీఆర్ఎస్ సభ్యులను గెంటివేశారు. హింసను ప్రేరేపిస్తూ, దాడులను ప్రోత్సహిస్తూ హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఆయన ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనను, అణచివేతను వివరిస్తూ ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, హింసాత్మక ఘటనలకు ఊతం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్షణమే గవర్నర్ భర్తరఫ్ చేయాలని, మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.



