సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా
200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానించేందుకు విస్తృత కసరత్తు
వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం
ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
Mbmtelugunews //హైదరాబాద్, సెప్టెంబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్) : సూర్యాపేట జిల్లాతోపాటు ఉమ్మడి నల్లగొండ, పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 19వ తేదీ శనివారం కోదాడలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ ఉపాధి మేళాకు 200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానించి, వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే ఎన్ పద్మావతీ రెడ్డి, ఇండస్ట్రీస్ & కామర్స్ అడిషనల్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్,ఎస్పి నరసింహ సంబంధిత శాఖల అధికారులు, కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యావంతులైన యువతలో నిరుద్యోగం నేడు సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటని మంత్రి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని స్పష్టం చేశారు.
“విద్యావంతులైన నిరుద్యోగ యువత, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రతిరోజూ చూస్తున్నాం. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు మంత్రిగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను. నిజమైన ఉపాధి అవకాశాలను అందించి, వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ మెగా జాబ్ మేళా ప్రధాన లక్ష్యం” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.గత ఏడాది అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించిందని మంత్రి గుర్తుచేశారు. ఆ మేళాలో సుమారు 200 కంపెనీలు పాల్గొనగా, దాదాపు 40 వేల మంది నిరుద్యోగ యువత పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.
వారిలో దాదాపు 20 వేల మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, సుమారు మూడు వేల మంది ఉద్యోగాలు పొందడం లేదా తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం జరిగిందని వివరించారు. హుజూర్‌నగర్ జాబ్ మేళా విజయంతో స్ఫూర్తి పొంది, అంతకంటే భారీ స్థాయిలో కోదాడలో ఉపాధి మేళాను నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని నిరుద్యోగ యువతను విస్తృతంగా సమీకరించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఇతర ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన యువత కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఐటీఐలకు ప్రత్యేక బృందాలను పంపించి, ముఖ్యంగా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను జాబ్ మేళాకు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు. సోషల్ మీడియా, స్థానిక ప్రచార కార్యక్రమాలు, ఇతర సమాచార వేదికల ద్వారా జాబ్ మేళా వివరాలు ప్రతి అర్హుడైన నిరుద్యోగ యువతకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచి 200 నుంచి 250 కంపెనీలను జాబ్ మేళాకు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కంపెనీలతో సమన్వయం, అభ్యర్థుల సమీకరణ, నమోదు, ఇంటర్వ్యూల నిర్వహణ, వేదిక ఏర్పాట్లు వంటి బాధ్యతలను ప్రత్యేక బృందాలకు స్పష్టంగా అప్పగించాలని ఆదేశించారు. కోదాడలోని సిసి రెడ్డి కాన్వెంట్‌ను మెగా జాబ్ మేళా వేదికగా ఖరారు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కాన్వెంట్‌లోని 32 గదులను వివిధ కంపెనీల ఇంటర్వ్యూ ప్యానళ్లకు కేటాయించవచ్చని, అదనంగా వచ్చే కంపెనీల కోసం మైదానం, పరిసర ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అభ్యర్థుల నమోదు, ఇంటర్వ్యూల నిర్వహణ, వాహనాల పార్కింగ్, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంతమంది అభ్యర్థులు హాజరైనా ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించాలని స్పష్టం చేశారు. ఉదయం ప్రారంభమయ్యే నియామక ప్రక్రియ అవసరమైతే సాయంత్రం వరకు కొనసాగించాలని, జాబ్ మేళాకు వచ్చిన ప్రతి అభ్యర్థికీ ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం కల్పించాలని మంత్రి సూచించారు. ఈ మెగా జాబ్ మేళాను ప్రభుత్వ కార్యక్రమంగా, నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు చురుగ్గా పాల్గొని, కార్యక్రమ విజయాన్ని సమష్టి బాధ్యతగా స్వీకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కార్యాలయం నుండి విడుదల చేయడమైనది.



