వర్షం కొరకు కోదాడ క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
Mbmtelugunews//కోదాడ, జూలై 26(ప్రతినిధి మాతంగి సురేష్) : స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ వి యేసయ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాస్టర్ యేసయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో సరైన వర్షపాతం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని, కాలువల ద్వారా నీరు అందక సాగు భూములు బీడుగా మారుతున్నాయని, ఎండిపోయిన పంటలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్న దయనీయ పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు తన కృపను చూపి రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిపించి, రైతులకు ఉపశమనం కలిగించాలని ప్రార్థించారు.
ఈ ప్రత్యేక ప్రార్థనలో సంఘంలోని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఏకమనస్సుతో పాల్గొని, రైతుల సంక్షేమం, పంటల అభివృద్ధి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థనలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



