Thursday, September 24, 2026
[t4b-ticker]

విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

:మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.

Mbmtelugunews//కోదాడ, జులై 31(ప్రతినిధి మాతంగి సురేష్): జాతీయ బీసీ సంక్షేమ యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే ప్రభుత్వం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందకపోవడంతో అనేక ప్రైవేట్ కళాశాలలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని, ప్రభుత్వానికి తమ సమస్యలను వివరించినా వారిపైనే ఒత్తిడి, బెదిరింపులు కొనసాగుతున్నాయని అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ, ఎన్నో కష్టాలు పడి తమ పిల్లలను చదివిస్తున్నారని తెలిపారు. అలాంటి సమయంలో కళాశాలలు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉన్నప్పటికీ, విద్యార్థులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. విద్యా ప్రమాణాలను పెంచాల్సిన ప్రభుత్వం, విద్యార్థులు, విద్యా వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బొల్లం మల్లయ్య యాదవ్, విద్యార్థులను క్రిమినల్ వేస్టులు అని సంబోధించడం అత్యంత బాధ్యతారాహిత్యమైనదని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఇది ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
చదువుకొని పట్టభద్రులైన యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఉద్యోగాల కోసం ప్రశ్నించిన యువతను కించపరిచేలా మాట్లాడడం తగదని పేర్కొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర విద్యార్థులకు, యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular