రాష్ట్రస్థాయి క్రికెట్‌కు కోదాడ అకాడమీ క్రీడాకారుల దూసుకెళ్లిన అడుగు
:అండర్-16 ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్‌కు ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టులో షేక్ అర్హన్, గొర్రె చాణిక్య.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్): గ్రామీణ మట్టిలో పుట్టిన ప్రతిభకు సరైన ప్రోత్సాహం లభిస్తే రాష్ట్రస్థాయి వేదికలపై సత్తా చాటగలమని కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు మరోసారి నిరూపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అండర్-16 ఇంటర్ స్కూల్ క్రికెట్ నాకౌట్ టోర్నమెంట్ కు ప్రాతినిధ్యం వహించనున్న ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన షేక్ అర్హన్, గొర్రె చాణిక్య ఎంపికయ్యారు. అండర్ 16 ఇంట్రా డిస్టిక్ లో ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ షేక్ అర్హన్ చక్కటి బౌలింగ్ తో అత్యధిక వికెట్లు సాధించాడు, గొర్రె చాణిక్య లీగ్ లో సెంచరీ సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి హెచ్ సిఏ అండర్ 16 నాక్ ఔట్ టోర్నమెంట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికతో కోదాడ క్రికెట్ అకాడమీ శిబిరంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కోదాడ క్రికెట్ అకాడమీ లో సాధన చేస్తూ తమ ప్రతిభను మెరుగుపరుచుకున్న అర్హన్, చాణిక్య ఇప్పుడు జిల్లా జట్టు తరఫున రాష్ట్రస్థాయి పోటీల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. గ్రామీణ ప్రతిభకు జిల్లా అసోసియేషన్ ప్రోత్సాహం ఎంతో కీలకం. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ సిద్ధిఖ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నప్పటికీ వారికి సరైన వేదిక, ప్రోత్సాహం లభించినప్పుడే వారి ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అందిస్తున్న నిరంతర సహకారం, ప్రోత్సాహం కారణంగా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు జిల్లా, రాష్ట్రస్థాయిలో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. కోదాడ వంటి ప్రాంతాల నుంచి క్రీడాకారులు జిల్లా జట్లకు ఎంపిక కావడం అకాడమీతో పాటు మొత్తం ప్రాంతానికే గర్వకారణమని పేర్కొన్నారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపుతున్న నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సయ్యద్ అమినోద్దిన్ కు కోచ్ షేక్ సిద్ధిఖ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల ఎదుగుదలకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు. అర్హన్, చాణిక్య ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపిక కావడం పట్ల కోదాడ క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు సలీం షరీఫ్, అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్, డాక్టర్ నందకిషోర్, ట్రెజరర్ ఖాజామియా, సతీష్, బడుగుల సైదులు, హమీద్, సురేష్, శంకర్, బుల్లయ్య, శ్రీకాంత్, శ్రీను, బాల్ రాజు తదితరులు హర్షం వ్యక్తం చేసి క్రీడాకారులను అభినందించారు.



