ఆటపాటలు ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్ కుసుమ బాబు
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్15(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ పట్టణంలో అలిగిన బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు బతుకమ్మ ఆటపాటలను ప్రారంభించారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు నిదర్శనమన్నారు. తొమ్మిది రోజులపాటు వివిధ పేర్లతో బతుకమ్మను పూజించడం మన సంస్కృతిలో ప్రత్యేకతను చాటుతుందన్నారు.

ఆశ్వయుజ మాసంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటారని, ఈ రోజును విశ్రాంతి దినంగా భావిస్తారని సంప్రదాయాలను భావితరాలకు అందించడంతోపాటు మహిళలంతా కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం ఆనందదాయకమన్నారు.
అనంతరం మహిళలు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ వేడుకలతో పట్టణంలో పండుగ శోభ నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో తోట జ్యోతి శ్రీనివాస్, ఎర్నేని నిర్మల, నెమ్మది దేవమని, మాతంగి శైలజ తదితరులు పాల్గొన్నారు.



