అవినీతి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు… అన్నీ ప్రజలకు తెలుసు!
:మాటలు ఎన్ని చెప్పినా… ప్రజల కళ్ల ముందు జరిగిన నిజాలను దాచలేరు.
:అధికారం ప్రజల కోసం… స్వప్రయోజనాల కోసం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు!
:అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలు మరిచిపోలేదు.
:అభివృద్ధి పనులను రాజకీయం చేయడం మానుకోవాలి.
:జీవో చూపించి ఘనత కొట్టేయడం కాదు.. పనులు పూర్తి చేసి ప్రజలకు అందించాలి.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్పై కాంగ్రెస్ నేత రావెళ్ల కృష్ణారావు ఘాటు విమర్శలు…
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 01 : 100 పడకల ప్రభుత్వాసుపత్రి విషయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నమే, అవినీతి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు… అన్నీ ప్రజలకు తెలుసని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు విమర్శించారు. జీవో పేపర్ ను చూపిస్తూ మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకోవాలానే ప్రయత్నం సరికాదని, జీవో జారీ చేయడంతోనే ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఫీలవుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అనుభవించిన మల్లయ్య యాదవ్.. తన హయాంలో ఆసుపత్రి పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనులపై రాజకీయ ఆరోపణలు చేయడం మానుకుని వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యేపై కమీషన్ల ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని, ఆరోపణలకు ఆధారాలుంటే ప్రజల ముందు ఉంచాలని, ఎవరి నుంచి ఎంత మొత్తం తీసుకున్నారో ఆధారాలతో వెల్లడించాలని సవాల్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగానే భావించాల్సి వస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో కోదాడ నియోజకవర్గంలో ఏం జరిగింది, ఏ పనులు పూర్తయ్యాయి, ఏవి అసంపూర్తిగా మిగిలాయి అన్నది ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పకుండా ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై విమర్శలు చేయడం వల్ల వాస్తవాలు మారవని అన్నారు. ప్రభుత్వాసుపత్రి, డయాలసిస్ కేంద్రం వంటి ప్రజా ఆరోగ్య అంశాలను రాజకీయ విమర్శలకు వేదికగా మార్చడం తగదని, ప్రజల ప్రాణాలు, ఆరోగ్యానికి సంబంధించిన సేవల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కోదాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులు, పూర్తయిన పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, వాటి పురోగతిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమని తెలిపారు. జీవోలు, శిలాఫలకాల చుట్టూ తిరిగే రాజకీయాలు కాదు.. పనులు పూర్తిచేసి ప్రజలకు ఫలితాలు అందించే రాజకీయాలు కావాలి. ఎవరి హయాంలో ఏం జరిగిందో కోదాడ ప్రజలకు అన్నీ తెలుసు. గతాన్ని మరిపించేందుకు ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవాలు కనుమరుగుకావు” అని రావెళ్ల కృష్ణారావు స్పష్టం చేశారు.



