తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన కీత శ్రీనివాసరావు
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 25(ప్రతినిధి మాతంగి సురేష్): సాధనమున పనులు సమకూరుదు ధరలోన అనే సూక్తిని నిజం చేస్తూ కీత శ్రీనివాసరావు ప్రపంచ స్థాయిలో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు.థాయిలాండ్ దేశంలో ఏప్రిల్ 17 నుండి 19 వరకు జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్–2026 అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, తన జట్టుకు సారథ్యం వహించారు. ట్రాక్, యోగా, ఈత అనే మూడు విభిన్న విభాగాల్లో పాల్గొని మూడు గోల్డ్ మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించి దేశానికి గర్వకారణమయ్యారు.
*బాల్యం నుంచే ఈతపై ఆసక్తి*
బాల్యం నుంచే ఈతపై మక్కువ పెంచుకున్న ఆయన, బేతవోలు చెరువు, నర్సాపూర్ చెరువు, మట్టపల్లి కృష్ణానది, బాసర గోదావరి, రాజమండ్రి గోదావరి, కొవ్వూరు గోదావరి, విజయవాడ కృష్ణా నదుల్లో ఈతలో నైపుణ్యం సాధించారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్విమ్మింగ్ కోచ్‌గా సేవలందించారు.
*యోగాసనాల్లో అద్భుత ప్రతిభ*
ఈతతో పాటు యోగాసనాల్లో కూడా అసాధారణ ప్రతిభ కనబరిచిన కేఎస్ రావు పీజీ డిప్లొమా, ఎంఎస్సీ యోగ పూర్తి చేశారు. నీటి మీద కూడా యోగాసనాలు చేయగల అరుదైన నైపుణ్యం కలిగిన ఆయన లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
లో స్థానం సంపాదించారు.
*కఠిన సాధన –విజయానికి పునాది*
ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు లేచి కోదాడ నుండి బేతవోలు వరకు ప్రయాణించి చెరువుల్లో ఈత సాధన, అనంతరం గంటన్నర పాటు యోగాసనాలు, తిరిగి మధ్యాహ్నం ప్రాక్టీస్ – ఈ కఠోర సాధన ఆయన విజయానికి మూలం.
*అనుకోని అవరోధం*
తల్లి అనారోగ్యం
అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఆయన తల్లి కీత జానకమ్మకి తీవ్రమైన అనారోగ్యం కలిగింది. కోదాడ నుంచి హైదరాబాద్ వరకు పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించాల్సి వచ్చింది.
ఈ సమయంలో ఆయన పూర్తిగా తల్లికి సేవ చేయడంలో నిమగ్నమయ్యారు. సరైన ఆహారం, నిద్ర లేకపోయినా బాధ్యతను వదల్లేదు.
అయినా కూడా జగ్గయ్యపేటలో జరిగిన పోటీల్లో పాల్గొని 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
మెడల్స్ సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనం.

*మొక్కవోని ధైర్యం*
అద్భుత విజయం
సుమారు 20 రోజులు ప్రాక్టీస్ లేకపోయినా, తనపై నమ్మకం కోల్పోకుండా థాయిలాండ్‌లో జరిగిన పోటీల్లో పాల్గొని
ట్రాక్‌లో గోల్డ్, బ్రాంజ్
స్విమ్మింగ్‌లో గోల్డ్, యోగాలో గోల్డ్ మొత్తంగా 3 గోల్డ్, 1 బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
*ప్రపంచ స్థాయిలో అరుదైన రికార్డు*
ట్రాక్, యోగా, ఈత అనే మూడు విభిన్న రంగాల్లో ఒకే వ్యక్తి ప్రతిభ చూపడం ప్రపంచ స్థాయిలో చాలా అరుదైన విషయం. ఇది ఒక ప్రత్యేక రికార్డుగా నిలిచింది.
*ప్రేరణాత్మక సందేశం*
దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినా అధిగమించవచ్చు. సాధన చేస్తే అసాధ్యం అనేది ఏదీ లేదు అని ఆయన తెలిపారు. మారుమూల గ్రామం నుంచి ప్రపంచ వేదిక వరకు ఎదిగిన ఆయన ప్రయాణం ప్రతి యువతకు ప్రేరణ.



