దళితబంధం అక్రమాలపై సమాధానం చెప్పాకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలీ….
:రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలి…..
:రాజకీయ పబ్బం కోసం రైతుల సమస్యలను వాడుకోవద్దు…..
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శలు హాస్యాస్పదం……
:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ల కృష్ణారావు.
కోదాడ, నవంబర్ 13(లోకం తీరు): రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడం మానుకోవాలని, రైతుల సంక్షేమం గురించి మాట్లాడే ముందు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కోదాడ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలులో జరిగిన అక్రమాలు, అవకతవకలు, అర్హులైన దళితులకు జరిగిన అన్యాయంపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ల కృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బొల్లం మల్లయ్య యాదవ్ చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ప్రజాస్వామ్యంలో తప్పు కాదని, అయితే రైతుల కష్టాలను రాజకీయ విమర్శలకు అస్త్రాలుగా మలుచుకోవడం, ప్రతి అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం మాజీ ఎమ్మెల్యే స్థాయికి తగదని హితవు పలికారు. రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే గతంలో అధికారంలో ఉన్న సమయంలో రైతుల కోసం ఏం చేశారు? వారి సమస్యలను ఎంతవరకు పరిష్కరించారు? అమలు చేసిన పథకాల ద్వారా ఎంతమందికి ప్రయోజనం చేకూర్చారు? అనే విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలు సమయంలో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగిందా? లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం చోటుచేసుకుందా? అర్హులను పక్కనపెట్టి ఇతరులకు ప్రయోజనం కల్పించారా? పథకం అమలులో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకున్నాయి? అనే ప్రశ్నలకు బొల్లం మల్లయ్య యాదవ్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దళితబంధు పథకం అమలులో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలు, కుమ్మక్కు వ్యవహారాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గతంలో అధికారాన్ని అనుభవించిన వారు తమ పాలనలో జరిగిన పరిణామాలకు బాధ్యత వహించకుండా, ఇప్పుడు రైతుల సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల పంటలకు మద్దతు ధర కల్పించడం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, బోనస్ వంటి హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతులకు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, అందుకు భిన్నంగా రైతుల పేరుతో రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో తమ పాలనలో జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పకుండా ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నారు. ముందుగా దళితబంధు పథకం అమలులో జరిగిన పరిణామాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చి, ఆ తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మాట్లాడాలని రావెళ్ల కృష్ణారావు హితవు పలికారు. రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను తెలుసుకున్న ప్రజలే ఇలాంటి విమర్శలకు తగిన సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు.



