మలక్పేట యశోద ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స…
:85 ఏళ్ల వృద్ధుడికి లాప్రోస్కోపిక్ పద్ధతిలో పిత్తాశయ శస్త్రచికిత్స విజయవంతం…..
:మలక్పేట యశోద ఆసుపత్రి వైద్యులు నాకు పునర్ జన్మ ఇచ్చారు…..
:వృద్ధుడు పుల్లయ్య
:22 మి.మీ. రాయి గుర్తింపు.. ప్రత్యేక వైద్య పరీక్షల అనంతరం చికిత్స…
కోదాడ, అక్టోబర్ 28(మనం న్యూస్): మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 85 ఏళ్ల వృద్ధుడికి లాప్రోస్కోపిక్ పద్ధతిలో పిత్తాశయ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. చిలుకూరుకు చెందిన పి పుల్లయ్య కొంతకాలంగా జ్వరం, కడుపునొప్పితో బాధపడుతుండగా, సమగ్ర వైద్య పరీక్షల ద్వారా ఆయన అనారోగ్యానికి గల కారణాలను గుర్తించి శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు వెల్లడించారు. కోదాడలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గుత్తా శశిధర్రెడ్డి పర్యవేక్షణలో, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్ శ్రీపతి ఆధ్వర్యంలో నిర్వహించిన చికిత్స వివరాలను వెల్లడించారు.
పిత్తాశయంలో 22 మి.మీ. రాయి గుర్తింపు
85 ఏళ్ల వయస్సు ఉన్న పుల్లయ్య జ్వరం, కడుపునొప్పితో పాటు మధు మేహం, రక్త పోటు తో బాధపడుతూ పలు ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ, ఆయన సమస్యకు స్పష్టమైన కారణం తెలియలేదని వైద్యులు తెలిపారు. అనంతరం మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వచ్చిన ఆయనకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పిత్తాశయంలో 22 మిల్లీమీటర్ల పరిమాణంలో రాయి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా పెద్దపేగు ప్రాంతానికి దట్టంగా అలుముకున్న ఓమెంటం అనే కొవ్వు కణజాలాన్ని కూడా గుర్తించినట్లు వైద్యులు వివరించారు. రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితి, సమస్యలోని సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకొని అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్సకు సిద్ధం చేసినట్లు తెలిపారు.
*లాప్రోస్కోపిక్ పద్ధతిలో విజయవంతంగా శస్త్రచికిత్స*
వృద్ధాప్యంలో శస్త్రచికిత్స నిర్వహించడం వైద్యపరంగా ప్రత్యేక శ్రద్ధతో కూడుకున్నప్పటికీ, వైద్య బృందం సమన్వయంతో పుల్లయ్యకు లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ (పిత్తాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స) విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఆధునిక వైద్య సదుపాయాలు, ప్రత్యేక పరీక్షలు, వైద్యుల పర్యవేక్షణతో ఆయనకు అవసరమైన చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. పలు ఆసుపత్రులను సంప్రదించినా తన సమస్యకు పరిష్కారం లభించని పరిస్థితుల్లో యశోద ఆసుపత్రి వైద్యులు తనకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఉపశమనం కలిగించారని పుల్లయ్య తెలిపారు. వైద్యుల చికిత్స తనకు పునర్జన్మ ప్రసాదించినట్లుగా ఉందని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గుత్తా శశిధర్రెడ్డి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్ శ్రీపతి శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్యం గా ఉన్న పుల్లయ్య తో కలిసి మీడియాకు వెల్లడించారు. వృద్ధాప్యంలో ఎదురయ్యే సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు సమగ్ర వైద్య పరీక్షలు, సరైన నిర్ధారణ, అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణ ఎంతో కీలకమని ఈ కేసు తెలియజేస్తోందని వివరించారు. జ్వరం చలి తో కడుపు నొప్పి తో బాధ పడే వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించు కోవాలనీ సూచించారు. ఈ సమావేశం లో కోదాడ ప్రముఖ వైద్యలు డా, శ్రీని వాస్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి, పుల్లయ్య కుటుంబ సభ్యులు సిబ్బంది ఉన్నారు.



