ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్-17 బాలికల క్రికెట్ జట్టుకు కోదాడ క్రీడాకారిణి సోమపంగు వర్షిని ఎంపిక
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 04( ప్రతినిధి మాతంగి సురేష్) : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించనున్న అండర్-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టులో కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారిణి సోమపంగు వర్షిని ఎంపికైంది. అక్టోబర్ 4న ఆదివారం రోజు మిర్యాలగూడలోని క్లియో గ్రౌండ్‌లో నిర్వహించిన టోర్నమెంట్-కం-సెలక్షన్స్‌లో వర్షిని సూర్యాపేట జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ఆమె అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచి సెలెక్టర్లను ఆకట్టుకుంది. తన ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వర్షిని, ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్-17 బాలికల క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం పట్ల కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ షేక్ అబూబకర్ సిద్దిఖ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి రాష్ట్రస్థాయికి తీసుకెళ్లడమే తమ అకాడమీ లక్ష్యమని తెలిపారు. వర్షిని తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకోని రాష్ట్రస్థాయిలో కూడా అద్భుతంగా రాణించాలని ఆకాంక్షించారు.
*కోదాడ నుంచి రాష్ట్రస్థాయికి మరో అడుగు*
వర్షిని బౌలింగ్ ప్రతిభకు ఇది గర్వకారణమైన గుర్తింపు అని కోచ్ షేక్ అబూబకర్ సిద్దిఖ్ పేర్కొన్నారు. వర్షిని ఎంపిక పట్ల కోదాడ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు, కోచ్‌లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.



