ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.
:బతుకమ్మలతో సందడి చేసిన మహిళలు.
: వార్డు మెంబర్ దార అఖిల ప్రేమ్ చంద్
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో 9వ వార్డు వార్డు మెంబర్ దారా అఖిల ప్రేమ చంద్ ఆధ్వర్యంలో 9వ రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి మందుల నాగయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి, సీఎం శ్రీను లు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలలో సందడి చేశారు. సద్దుల బతుకమ్మ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు నిదర్శనమన్నారు.

తొమ్మిది రోజులపాటు వివిధ పేర్లతో బతుకమ్మను పూజించడం మన సంస్కృతిలో ప్రత్యేకతను చాటుతుందన్నారు. ఆశ్వయుజ మాసంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటారని అన్నారు. సంప్రదాయాలను భావితరాలకు అందించడంతోపాటు మహిళలంతా కలిసిమెలిసి పండుగను జరుపుకోవడం ఆనందదాయకమన్నారు.
అనంతరం మహిళలు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ వేడుకలతో గుడిబండ గ్రామంలో పండుగ శోభ నెలకొంది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో పవన్, మాదాసు శ్రీను, రాందాసు, గామయ్య, కాలతిరుపతి శ్రీను, మాదాసు నాగరాజు, గణేష్, ప్రవీణ్, పల్లి నాగరాజు, ఉండేటి సుందర్ రావు, గురుమూర్తి, బ్రహ్మం, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు



