నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే జాతీయ రహదారి దిగ్బంధం, సబ్ స్టేషన్ల ముట్టడి చేస్తాం
:కళ్లముందే పంటలు ఎండుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.
:సూర్యాపేట విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నిరసన.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): రైతులను ఆదుకోవాలనే కనీస ఆలోచన, చిత్తశుద్ధి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆయన బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి సూర్యాపేట జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ కి వినతిపత్రం అందచేసి, అనంతరం ఎస్ఈ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఏ మారుమూల గ్రామంలో చూసినా నేడు రైతులు ఆందోళన చేసే పరిస్థితి దాపురించింది. అప్పులు చేసి నాట్లు వేసుకుంటే, కళ్ల ముందే పచ్చని పంటలు ఎండిపోతుంటే రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. నీళ్లు, కరెంటు ఇవ్వలేని ఈ ప్రభుత్వం రైతుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పంటలు పండితే ధాన్యం కొనాల్సి వస్తుందని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో అసలు పంటలే పండకుండా చేయాలని కుట్ర చేస్తోంది. కృష్ణా జలాలను పక్క రాష్ట్రాలకు తరలిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.అప్రకటిత విద్యుత్ కోతలు, నాణ్యత లేని కరెంటు వల్ల రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లు బాగుచేయించుకోవడానికి రైతులు వారాల తరబడి మెకానిక్ షాపుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో కనురెప్ప పాటు కూడా కరెంటు పోలేదు. కానీ నేడు ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. వెంటనే విద్యుత్ సరఫరాను మెరుగుపరిచి, పచ్చని పంటలను రక్షించడానికి 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందించాలనీ, చెరువులు నింపడానికి, భూగర్భ జలాలు పెంచడానికి నిరంతరాయంగా సాగర్ జలాలను విడుదల చేయాలనీ. వరి పంటల కోతలు పూర్తయ్యే వరకు సాగర్ నీటిని ఆయకట్టుకు ఏ విధంగా ఇస్తారో వెంటనే షెడ్యూల్ (క్యాలెండర్) ప్రకటించాలనీ , బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించినట్లుగా 14వ తేదీలోపు క్యాలెండర్ ప్రకటించకపోతే పాదయాత్ర చేపడతామని డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా ఎస్ఈ ని కలిసి పరిస్థితిని వివరించాం. కిందిస్థాయి అధికారులు తాము పైనుంచి వచ్చిన ఆదేశాలే పాటిస్తున్నాం అంటున్నారు. ఉన్నతాధికారులతో, మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని ఎస్ఈ హామీ ఇచ్చారు. మరో మూడు, నాలుగు రోజులు వేచి చూస్తాం. అప్పటికీ పరిస్థితి చక్కబడక, నాణ్యమైన విద్యుత్ అందించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, రైతుల సమన్వయంతో హైవేలను (జాతీయ రహదారులను) దిగ్బంధిస్తాం, నియోజకవర్గంలోని అన్ని సబ్ స్టేషన్లను ముట్టడిస్తాం అని ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు.



