మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం హేయమైన చర్య.
:సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: బొల్లం మల్లయ్య యాదవ్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా, కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తూ కోదాడలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ఎండగడుతూ కోదాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రులు, సీనియర్ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కౌరవ సభను తలపించేలా, దుశ్శాసన పర్వాన్ని గుర్తుచేసేలా ఉందని మల్లయ్య యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి అనైతిక దాడిని ఖండించాల్సిన ముఖ్యమంత్రి, దాన్ని వక్రీకరిస్తూ పోలీసులను వెనకేసుకురావడం ఆయన అహంకారానికి నిదర్శనం అని, ఎన్నికల్లో అమలుకాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇన్నాళ్లవుతున్నా ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఆ వైఫల్యం నుండి, ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా అసెంబ్లీలో సభను పక్కదారి పట్టిస్తున్నారాని, ఒకవైపు గాంధేయవాదం గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, మరోవైపు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో నడిబజారులో పట్టపగలే హత్యలు, దోపిడీలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. హోం మంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుని ఢిల్లీకి కప్పం కట్టేందుకే కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారని, తెలంగాణ ప్రజా ధనాన్ని ఢిల్లీకి దోచిపెడుతూ తెలంగాణ సమాజానికి నమ్మకద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.తెలంగాణ సాధకుడు, జాతిపిత కేసీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్మివేసినట్లేనని, అది తిరిగి మీ ముఖం మీదే పడుతుందని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. ఆవేశంలో ఎవరైనా ఒక మాట జారితే ఉదయాన్నే ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేస్తున్న పోలీసులు.. మరి మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనీ, దాడికి పాల్పడిన పోలీసు అధికారులపై తక్షణమే చట్టపరమైన, కఠిన చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సమస్యలపై, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో సమగ్రమైన, సుదీర్ఘమైన చర్చ జరగాలనీ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ తన పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తుందని మల్లయ్య యాదవ్ స్పష్టంచేశారు.



