Tuesday, October 6, 2026
[t4b-ticker]

27 లక్షల మందికి ఆకలిని ఒకేసారి తీర్చిన ఘనత.. ప్రపంచంలోనే అరుదైన మహా ఘట్టం

27 లక్షల మందికి ఆకలిని ఒకేసారి తీర్చిన ఘనత.. ప్రపంచంలోనే అరుదైన మహా ఘట్టం
‎
:పౌష్టికాహారమే విద్యార్థుల శక్తి.. ఆరోగ్యవంతమైన తరమే తెలంగాణ భవిష్యత్తు‎.
‎
:‎బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదు.. మళ్లీ వచ్చేది ఎందుకో చెప్పాలి.
‎
:‎సంక్షేమం ఉచితం కాదు.. రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధికి పెట్టుబడి.

:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
‎
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 06 (ప్రతినిధి మాతంగి సురేష్): ‎రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని, తెలంగాణలోనే ఈ వినూత్న పథకాన్ని అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం ఉచితం కాదని, అది రాష్ట్ర భవిష్యత్తు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో రాష్ట్ర ఉత్పత్తికి పెద్ద ఎత్తున తోడ్పడతారని, తద్వారా జీఎస్‌డీపీ వృద్ధికి దోహదం చేస్తారని చెప్పారు. ‎సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మునగాల గ్రామంలో పాఠశాలల విద్యార్థుల కోసం రూ.9.6 కోట్లతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. 1,020 పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ఒకే కిచెన్‌ నుంచి పరిశుభ్రమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందించేందుకు మునగాలలో ఈ గ్రీన్‌ఫీల్డ్‌ కిచెన్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

*రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వేయం.*


రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు వారానికి ఆరు రోజులపాటు అల్పాహారం అందిస్తున్నామని  తెలిపారు. మూడు రోజులు పాలు, మూడు రోజులు రాగిజావ అందిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్ద వంద మందికి వంట చేయడం కూడా కష్టమైన పరిస్థితుల్లో 27 లక్షల మంది విద్యార్థులకు ఏకకాలంలో అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది తెలంగాణ ప్రభుత్వ మానవీయ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తని అన్నారు. ఎదిగే వయసులో పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తేనే వారు ఆరోగ్యవంతమైన మానవ వనరుగా ఎదుగుతారని చెప్పారు. అందుకే పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు చిన్ననాటి నుంచే నాణ్యమైన ఆహారం అందిస్తూ, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని వివరించారు.

*‎సంక్షేమం ఉచితం కాదు.. పెట్టుబడే*
‎
‎ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉచితాలుగా చూడొద్దని భట్టి విక్రమార్క అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులపై చేస్తున్న ఖర్చు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తిరిగి ప్రయోజనం చేకూర్చే పెట్టుబడిగా అభివర్ణించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటం, పిల్లలు చదువుకోవడం, మహిళలు ఆర్థికంగా ఎదగడం, రైతులకు పెట్టుబడి సాయం అందడం ద్వారా రాష్ట్ర ఉత్పాదకత పెరుగుతుందని చెప్పారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్‌, సన్నబియ్యం, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, వడ్డీలేని రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇందిరమ్మ ఇళ్లు వంటి కార్యక్రమాలన్నింటి అంతిమ లక్ష్యం పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమేనని అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.

*‎బీఆర్‌ఎస్‌కు గతమే.. భవిష్యత్తు లేదు*
‎
‎బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తామని చేస్తున్న ప్రకటనలపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో స్పందించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ వస్తామని చెబుతున్నారని, అసలు ఏం చేయడానికి వస్తున్నారో ప్రజలకు చెప్పాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లను ఆపడానికి వస్తారా? సన్నబియ్యం పంపిణీ నిలిపివేయడానికి వస్తారా? 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఆపడానికి వస్తారా? మహిళల వడ్డీలేని రుణాలు నిలిపివేయడానికి వస్తారా? పేద విద్యార్థులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని ఆపడానికి వస్తారా? అని భట్టి ప్రశ్నించారు. ప్రజలు అమాయకులు కాదని, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గమనిస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు.

*‎నవంబర్‌ 19న ఇందిరమ్మ కుటుంబ బీమా*
‎
‎రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని తీసుకురానున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. నవంబర్‌ 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కుటుంబ యజమానికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భద్రత కల్పించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం తమ కుటుంబానికి భద్రత ఉందనే ధైర్యంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దేశంలోనే ప్రత్యేకమైన పథకంగా ఇందిరమ్మ కుటుంబ బీమాను అమలు చేయనున్నట్లు తెలిపారు.

*‎రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌*
‎
‎ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థులంతా ఒకే పాఠశాలలో ఒకే కుటుంబంలా చదువుకునేలా ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లిష్‌ మీడియం విద్యతో పాటు క్రీడలు, స్టేడియం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు.
‎
*‎ప్రజలే మా కుటుంబం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*


‎
‎కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంత ప్రజలే తమ కుటుంబమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారని, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకులు లభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని భట్టి అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారాన్ని ప్రదర్శించడానికి కాకుండా ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి పనిచేయాలని, ఆ కోవాలోనే ఉత్తమ్ దంపతులు ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అభివర్ణించారు.  మునగాల హెలిప్యాడ్‌ నుంచి సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ శంకుస్థాపన ప్రాంతం వరకు కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు సుమారు 500 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular