రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లూటీ రాజ్యం – పోలీసుల లాఠీ రాజ్యం నడుస్తుంది
:ఉత్తమ్ దంపతుల మాటలు ఉత్తుత్తి మాటలే
:కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Mbmtelugunews//కోదాడ, జనవరి 13( ప్రతినిధి మాతంగి సురేష్): ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా గెలుపొందిన వారికి నిర్వహించిన సన్మాన సభలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ…రాష్ట్రంలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ కాలయాపన తప్ప ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగుందని ప్రజలు భావిస్తున్నారని, అదే తీర్పును ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని గ్రహించి కోట్ల రూపాయల దోపిడీకి తెగబడుతున్నారని, సమస్యలపై ప్రశ్నించిన వారిపై పోలీసులను ప్రయోగిస్తూ లాఠీలతో సమాధానం చెప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లూటీ రాజ్యం, పోలీసుల లాఠీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు సహా అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కనీసం యూరియా కూడా సకాలంలో అందించలేకపోతున్నారని, రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు యూరియా ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటూ తమ ఆదాయంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. గాలి మోటార్లలో తిరుగుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునే ఉత్తమ్ దంపతులకు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎప్పుడూ వందల కోట్ల అభివృద్ధి చేశామని చెప్పే వారి మాటలు ఉత్తుత్తి మాటలేనని అన్నారు. వారు చేసిన మోసాలకు ప్రతిఫలంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు మెజారిటీ స్థానాలు అప్పజెప్పి గట్టిగా బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఫలితాలలో బీఆర్ఎస్ పార్టీ ఆదరణను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించడకుండా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.రాష్ట్రం లో ఎప్పుడూ ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. హామీల అమలుకు చేతకాని కాంగ్రెస్ పార్టీది మాటల ప్రభుత్వమైతే, గత పదేళ్లుగా అన్ని వర్గాలను ఆదుకుంటూ అభివృద్ధి చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వమే చేతల ప్రభుత్వమని కొనియాడారు. రాజకీయ జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమికి కృంగిపోవద్దని, ఓటములు లేకుండా విజయాలు సాధ్యం కాదని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే స్ఫూర్తితో రాబోయే ప్రతి ఎన్నికలో గులాబీ జెండా ఎగరేలా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.



