అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య సేవలకి పురస్కారం
Mbmtelugunews//కోదాడ, జనవరి 26( ప్రతినిధి మాతంగి సురేష్ ): పట్టణం ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా,పి పెంటయ్య ఉత్తమ సేవలకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖలో వివిధ హోదాలలో గత 28 సంవత్సరాలుగా అంకిత భావంతో సేవలందిస్తూ అనేక జంతుజాలానికి ప్రాణం పోసిన అసిస్టెంట్ డైరెక్టర్. ఉద్యోగపరంగా కేవలం వైద్య విధులకే పరిమితం కాకుండా నేటి కాలంలో పశుపోషకులకు పాడి లాభసాటిగా మార్చడం కోసం వినూత్నంగా ఆలోచిస్తూ పశుపోషకులకు ఉత్పత్తి ఖర్చు తగ్గించడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో అత్యవసర ఔషధాలను పశువులకు ఉచితంగా ఇస్తూ పశుపోషణలో సంవత్సరానికి 5 కోట్ల రూపాయల పైన అదనపు ఆదాయాన్ని సృష్టిస్తున్నారు. పశువైద్యశాఖలో వైద్యులకు , పారా సిబ్బందికి, కాలేజీ నుండి హౌస్ సర్జన్ పశువైద్య విద్యార్థులకు కృత్రిమ గర్భధారణలో శిక్షణ ఇస్తూ జిల్లా అంతటా పశువులకు మేలైన వైద్యసేవలు అందించడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు. పశు యజమానులకు ఆధునిక పశుపోషణపై దూరదర్శన్ రైతునేస్తం కార్యక్రమాల ద్వారా పశుపోషకులకు రైతుల ను చైతన్య పరుస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వీసులో ఇది 16 వ అవార్డు కాగా ఇప్పటివరకు 11 జిల్లా అవార్డులు, నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులు కాగా ఒక సారి కేంద్ర ప్రభుత్వం చే జాతీయ ఉత్తమ పశువైద్యాధికారి గా అవార్డులు స్వీకరించారు.
అవార్డు ప్రదానోత్సవంలో అసిస్టెంట్ డైరెక్టర్ సేవలను అభినందించిన జిల్లా కలెక్టర్.



