ప్రజలపై కఠిన నిబంధనలు.. పెద్దలపై మృదువైన వైఖరి — ఇదేనా సమాన న్యాయం?
:సామాన్యుడు తప్పు చేస్తే చట్టం ముందు నిలబెడతారు.. కార్పొరేట్ తప్పు చేస్తే అదే చట్టం ఎందుకు మౌనంగా ఉంటుంది?
:చట్టం అందరికీ సమానమైతే.. సామాన్యుడికో నిబంధన, కార్పొరేట్‌కో మరో న్యాయం ఎందుకు?
:చట్టం బలహీనుడిపై పిడుగు కావద్దు.. బలవంతుడి ముందు నీడలా మారకూడదు.
:చట్టం ముందు అందరూ సమానమే అంటారు.. మరి ఆ సమానత్వం ఆచరణలో ఎక్కడ?
:చిరు వ్యాపారులకు ఓ న్యాయం కార్పొరేట్ కు మరో న్యాయమా?
:కోదాడ ట్రాఫిక్ పోలీసుల తీరుపై చర్చ..?
:రోడ్డును పోలీస్ బారికేళ్లతో బ్లాక్ చేసిన
షాపింగ్ మాల్ యాజమాన్యం…!
ట్రాఫిక్ పోలీసుల మౌనం..?
Mbmtelugunews//కోదాడ అక్టోబర్ 2 (ప్రతినిధి మాతంగి సురేష్) : మూడు జిల్లాలకు సరిహద్దుగా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ ద్వారంగా ఉన్న కోదాడ పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ నిత్యం రద్దీగా మారుతోంది. పట్టణ విస్తరణతో పాటు అనేక విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, షాపింగ్ మాల్స్ ఏర్పడుతుండటంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. ఫలితంగా ట్రాఫిక్ నియంత్రణ పట్టణంలో అత్యంత కీలక అంశంగా మారింది. ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో రహదారులపై ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సిన ట్రాఫిక్ పోలీసులు.. మరోవైపు సామాన్య వాహనదారులు చిన్నపాటి నిబంధన ఉల్లంఘించినా చలాన్లతో కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
సామాన్యుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్.. ప్రజా రహదారిని అడ్డుకుంటే మాత్రం మౌనం..! ఇదీ కోదాడలోని చెన్నై షాపింగ్ మాల్ వద్ద ట్రాఫిక్ నిబంధనల అమలు తీరుపై వినిపిస్తున్న ప్రశ్న. రైతు అయినా.. రోజువారీ కూలీ అయినా.. సామాన్య వాహనదారుడై నా.. ట్రాఫిక్ నిబంధన తెలియక చిన్న పొరపాటు చేసినా చలాన్ రూపంలో జరిమానా విధించడంలో ట్రాఫిక్ పోలీసులు ముందుంటున్నారు. కానీ కళ్లముందే ప్రజా రహదారిపై అడ్డంకులు ఏర్పాటు చేసిన ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా, సంబంధిత ట్రాఫిక్ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. సామాన్యుడిపై కొరడా.. కార్పొరేట్ సంస్థలపై మౌనమా..? అన్న చర్చ కోదాడలో సాగుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడం పోలీసుల విధుల్లో భాగమే. అయితే అదే నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ అధికారులదే. రైతులు, కూలీలు, సామాన్య వాహనదారులు నిబంధనలు తెలియకో, అత్యవసర పరిస్థితుల్లోనో చిన్న తప్పిదం చేస్తే వెంటనే చలాన్లు విధించే పోలీసులు.. మరోవైపు ప్రజలు ప్రయాణించే రహదారిపై బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలకు ఆటంకం కలిగించే పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

షాపింగ్ మాల్ పరిసరాల్లో రహదారిపై ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు పోలీసు వారివే కావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బ్యారికేడ్లు కారణంగా రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత ట్రాఫిక్ అధికారులు అక్కడి పరిస్థితిని పరిశీలించి చర్యలు తీసుకున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రోడ్ల వెంబడి పండ్ల బుట్టలు, కూరగాయల బుట్టలు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టే అధికారులు షాపింగ్ మాల్స్ వారు రోడ్డును బ్లాక్ చేసిన వాళ్లను ఎందుకు ఇబ్బంది పెట్టట్లేదు వారు చేస్తున్న మంచి ఏంటి మేం చేస్తున్న తప్పేంటి అని పలువురు చిరు వ్యాపారులు వాపోతున్నారు.ప్రజలపై కఠిన నిబంధనలు.. పెద్దలపై మృదువైన వైఖరి — ఇదేనా సమాన న్యాయం. సామాన్యుడు తప్పు చేస్తే చట్టం ముందు నిలబెడతారు.. కార్పొరేట్ తప్పు చేస్తే అదే చట్టం ఎందుకు మౌనంగా ఉంటుంది?
రూల్స్ అమలు అంటే చలాన్లు వేయడమేనా…?
ట్రాఫిక్ పోలీసుల పని కేవలం నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు చలాన్లు విధించడానికే పరిమితం కాదు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, రహదారులపై అడ్డంకులు లేకుండా చూడటం, ప్రజల సురక్షిత రాకపోకలకు మార్గం కల్పించడం కూడా వారి బాధ్యతల్లో భాగమే. అయితే చలాన్ల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధ.. ట్రాఫిక్ వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రహదారిపై అడ్డంకులు ఏర్పడితే వాటిని తొలగించాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసులపై ఉంది. అయితే అలాంటి పరిస్థితులకు అనుమతి ఎవరు ఇచ్చారు? అనుమతి లేకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తే చర్యలు ఎందుకు లేవు? సామాన్యుడికి వర్తించే ట్రాఫిక్ నిబంధనలు పెద్ద సంస్థలకు ఎందుకు వర్తించవు? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
సామాన్యులు, రైతులు, రోజువారీ కూలీలు నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లతో కఠినంగా వ్యవహరించడం ఎంత అవసరమో.. ప్రజా రహదారులపై ఏర్పడే అడ్డంకులను తొలగించి ట్రాఫిక్ సజావుగా సాగేలా చూడటం కూడా అంతే అవసరం. ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒకటే అయితే.. వాటి అమలు కూడా అందరికీ ఒకేలా ఉండాలి. సామాన్యుడిపై చలాన్ల పుస్తకం తెరిచే పోలీసులు.. రోడ్డును బ్లాక్ చేసే వారిపై ఎప్పుడు చర్యల పుస్తకం తెరుస్తారో వేచి చూడాలి.



